ప్రచురణ తేదీ : Jan 12, 2018 10:22 PM IST

అజ్ఞాతవాసిని అలా మిస్ అయిన ఇళయదళపతి విజయ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో వచ్చిన అజ్ఞాతవాసి ఇప్పుడు పూర్తిగా డివైడ్ టాక్ తో చాలా చోట్ల ఢీలా పడింది.మొదట్లో ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కు ఇది రీమేక్ గా వస్తోందని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ టీజర్ లోని సీన్స్ ని ఫ్రెంచ్ చిత్రంతో కంపేర్ చేసి ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. అయితే అది కేవలం ఒక అపోహ అని అటువంటిది ఏమి ఉండి ఉండదని అందరూ అనుకున్నారు. కానీ చివరికి చిత్రం విడుదల తర్వాత చూస్తుంటే ఆ చిత్రాన్ని దాదాపుగా త్రివిక్రమ్ అనుకరించినట్లు చాలా వరకు అర్ధం అవుతుందని, టి సిరీస్ వారు ఇదివరకే లార్గో వించి రైట్స్ కొనుగోలు చేశారు కాబట్టి వారితో మున్ముందు ఎటువంటి వివాదాలు జరగకుండా తెరవెనుక కొంత ముట్టచెప్పి ముందే సర్ధేశారు అనే కధనాలు కూడా ప్రచారం లో వున్నాయి.

అయితే ఒకప్పుడు ఈ ఫ్రెంచ్ చిత్రాన్ని తాము తెరకెక్కించాలి అని టాప్ లీగ్ లో వున్న కొంత మంది దర్శకులు ప్రయత్నాలు చేసి విరమించుకున్నట్లు సమాచారం. అసలు విషయం ఏంటంటే అప్పట్లో గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని విజయ్ హీరోగా తీయాలని భావించి ఒక ఫోటోషూట్ కూడా చేసి, ఫస్ట్ లుక్ తాలూకు పోస్టర్ లా ఒక పోస్టర్ కూడా డిజైన్ చేసి చిత్రానికి ‘యోహన్ అధ్యాయం ఒండ్రు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట, కానీ తర్వాత కాల్షీట్ల సమస్య వల్లనో, లేక సబ్జెక్టు మీద నమ్మకం లేకనో, మరే ఇతర కారణం చేతనో ఆ చిత్రం ప్రారంభం లోనే ఆగిపోయింది. అయితే ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అవుతోంది . తమిళం లో కల్ట్ మూవీ డైరెక్టర్ గా పేరున్న గౌతమ్ మీనన్ ఒక వేళ ఈ చిత్రం తెరకెక్కించి ఉంటే ఖచ్చితంగా ఇలా అవసర కామెడీ ని ఇరికించడం వంటి పనులు చేసేవాడు కాదేమో అని ఒక అభిప్రాయం. ఒక వేళ ఆ చిత్రం తెరకెక్కివుంటె ఖచ్చితంగా దాన్ని తెలుగులోను, హిందీలోను రీమేక్ గానో లేక డబ్బింగ్ వర్షనో వచ్చి ఉందేదని, అప్పుడు ఇలా పవన్ త్రివిక్రమ్ ల ప్రయోగం తప్పిఉండేదని అంటున్నారు. ఏదేమయినప్పటికీ ఏది మన చేతుల్లో ఉండదు, తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుందని పెద్ద వాళ్ళు అన్నట్లు, తీసే ప్రతి సినిమా మీద కూడా ఆ హీరో పేరు రాసే ఉంటుంది. ఈ విధంగా ఫోటో షూట్లు జరిగి ప్రారంభ దశలోనే ఆగిపోయిన చిత్రాలు చాలానే వున్నాయి. మొత్తానికి అజ్ఞాతవాసి వల్ల విజయ్ ఈ పాత చిత్రం విషయం బయటికి వచ్చింది….

Comments