ప్రచురణ తేదీ : Fri, Apr 13th, 2018

‘ఎస్పీ బాలు’ గారి రికార్డును బద్దలు కొట్టిన ‘గానగంధర్వుడు’

తన సుమధుర గాత్రంతో సంగీత ప్రియులను ఎంతగానో మెప్పించిన ‘గానగంధర్వుడి’గా పేరుగాంచిన ప్రముఖ గాయకులు కేజే యేసుదాసు. ఆయన తెలుగు సినిమాల్లో గాలి వానలో వాన నీటిలో, ఆకాశ దేశాన ఆషాడ మాసాన, అపురూపమైనదమ్మ ఆడజన్మ, బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే, బోయవాని వేటకు, ఇదేలే తరతరాల చరితం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాడిన అటువంటి సుమధుర గీతాలు ఎన్నో వున్నాయి. అటువంటి గానగంధర్వుడు నేడు ఒక సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈరోజు ప్రకటించిన 65వ జాతీయ సినిమా అవార్డుల్లో ఆయన ఉత్తమ గాయకుడి అవార్డుకు ఆయన ఎంపియ్యారు. మలయాళ చిత్రం ‘విశ్వాసపూర్వం మన్సూర్‌’లోని ‘పోయి మరాంజకాలం’ అనే పాటకుగానూ ఆయనకు ఈ పురస్కారం లభించింది.

ఎనిమిదోసారి అవార్డు పొందడం ద్వారా యేసుదాస్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. 1961లో గాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన యేసుదాసు, తెలుగు సహా వివిధ భాషల్లో ఎన్నో మధుర గీతాలు ఆలపించారు. తన సుమధుర గాత్రంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ గానగాంధర్వుడు 1972లో మొదటిసారిగా జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డు పొందారు. తర్వాత 1973, 1976, 1982,1987, 1991, 1993 సంవత్సరాల్లో కూడా అవార్డులు పొందారు. దీంతో ఆరు జాతీయ అవార్డులు పొందిన మరో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికార్డును యేసుదాసు నేటితో బ్రేక్‌ చేసినట్లయింది. అంతేకాక 23 సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ గాయకుడిగా ఎంపికైన యేసుదాసు,

1987 నుంచి తన పేరును పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా కొత్త గాయకులకు ఈ అవకాశం లభిస్తుందని ఆయన ఉద్దేశం. సంగీత రంగంలో ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1977లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్‌, 2017లో పద్మవిభూషణ్‌ అవార్డులతో సత్కరించిన విషయం తెలిసిందే…..

Comments