ప్రచురణ తేదీ : May 24, 2018 12:29 AM IST

తనకంటే బాగాచేశానని ఆ హీరో నా సీన్ తీసేయించారు : నటుడు పృథ్విరాజ్


పలు విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు అయిన ఒకప్పటి సీనియర్ నటుడు పృథ్వి రాజ్ అప్పట్లో తెలుగు, తమిళ , హిందీ భాషల్లో పలు చిత్రాల్లో తన నటనతో మంచి పేరు సంపాదించారు. కాగా అయన తెలుగులో పెళ్లి, దేవుళ్ళు, గౌతమ్ ఎస్ ఎస్ సి, చెన్నకేశవ రెడ్డి, గగనం తదితర చిత్రాలలో అద్భుతంగా నటించి అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తరువాత అడదడపా మాత్రమే చిత్రాలు చేస్తూ వచ్చారు. కాగా ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు అప్పట్లో మంచి అవకాశాలే వచ్చాయని, భాషా బేధంలేకుండా అన్ని రంగాల ప్రేక్షకులు తనను అబిమానించేవారని చెప్పారు. అయితే ఒక చిత్రం విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు నాలుగు పేజీలున్న డైలాగ్ ఒకటి ఆ చిత్ర దర్శకుడు ఇచ్చారని, అది సింగల్ టేక్ లో చెప్పవలసిన డైలాగ్ అని, నిజానికి ఆ సీన్ సూర్యోదయం సమయంలో చేయవలసి ఉందనిఅన్నారు. ఒకవేళ ఈ రోజు అంతపెద్ద డైలాగ్ వున్న సీన్ అవ్వకపోతే మళ్లి రేపు ఇదే సమయానికి చేయవలసి వస్తుందని డైరెక్టర్ చెప్పడంతో తాను ఎంతో జాగ్రత్తగా కష్టపడి అంత భారీ డైలాగ్ వున్న సీన్ ని ఒక్క టేక్ లో పూర్తి చేశానన్నారు.

తన నటనకు ఉప్పొంగిపోయిన యూనిట్ సభ్యులు తనను అభినందనలతో ముంచెత్తారని చెప్పారు. తీరా సినిమా విడుదల తర్వాత చూస్తే ఆ సన్నివేశం సినిమాలో లేకపోవడంతో సీన్ ఏమయిందయ్యా అని అడగ్గా, హీరోగారు తీసేయమన్నారు సార్ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ తిన్నానని చెప్పారు. నిజంగా అసూయపడే హీరోలు అక్కడక్కడా వున్నారని, ఇటువంటి ఘటనలు తన సినీ జీవితంలో కొన్ని జరిగాయని చెప్పుకొచ్చారు. తనకు సినిమానే ప్రపంచమని, ఎటువంటి పాత్ర ఇచ్చినా దానికి తగ్గట్లు నన్ను నేను మలుచుకుని నటించడం తనకు ఇష్టమని, అంతేకాని వేరేవారికంటే బాగా గొప్పగా చేసానని తాను ఎప్పుడు చెప్పుకోలేదని పృథ్వి అన్నారు…..

Comments