ప్రచురణ తేదీ : Mon, Jan 9th, 2017

తెలంగాణాలో ఆర్టీసీ బస్సు లలో స్వైపింగ్ మెషీన్స్

rtc-bus
ఆర్టీసీ బస్సు లలో చిల్లర దొరక్క కండక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నోట్ల రద్దు తరువాత చిల్లర కష్టాలు ఇంకా ఎక్కువ అయ్యాయని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా ఆర్టీసీ బస్సు లలో స్వైపింగ్ మెషీన్స్ ప్రవేశ పెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో కండక్టర్లకు ఆయన స్వైపింగ్ మెషీన్స్ అందజేశారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి ఆర్టీసీ బస్సు లోనే దుబ్బాక వరకు ప్రయాణం చేశారు. హరీష్ రావు తన రూపే కార్డు తో నగదును బదిలీ చేసి టిక్కెట్ తీసుకున్నారు.

ఇంకా మంత్రి హరీష్ రావు సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోర్టులలో కేసులు వేస్తూ అభివృద్ధి పనులకు మోకాలడ్డుతుందని విమర్శించారు. తాము ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. అభివృద్ధి నిరోధక పార్టీగా ప్రభుత్వంపై 37 కేసులు వేసిందన్నారు. అధికారంలో ఉన్నంత కాలం దోచుకున్న ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే మింగుడుపడడం లేదు అని విమర్శించారు. సాగు నీరు, తాగునీరు, కరెంటు ఉత్పత్తి కాకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలన్నారు. ఇంకా సర్కారు ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచడానికి నజరాలను ప్రకటించడానికి ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశ పెట్టబోతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.

Comments