సోనమ్ పెళ్లి వెనక అన్నదమ్ముల కలత?
లెజెండరీ శ్రీదేవి మరణం అన్యోన్యమైన ఆ అన్నదమ్ముల్లో కలతకు కారణమైంది. ఇలాంటిది ఊహించనిది. పెళ్లికి వెళితే విషాదం ఎదురవ్వడం … శ్రీదేవి ఆకస్మిక మరణం .. బోనీతో పాటు, అతడి సోదరుడు అనీల్ కపూర్ ఇంట్లోనూ ఎన్నో ఇబ్బందులకు కారణమైంది. అప్పటికే ఏడాదిగా కుమార్తె సోనమ్ కపూర్ పెళ్లి గురించిన తర్జన భర్జన సాగుతోంది. తను ప్రేమించిన వ్యక్తితో సోనమ్ పెళ్లి నిశ్చయించేందుకు ఏర్పాట్లలో ఉన్న అనీల్ కపూర్‌కి అది అతిపెద్ద విఘాతంగానూ పరిణమించింది. ఏదైతేనేం చావు ఇంట పెళ్లి వేడుకతో కలతను దూరం చేయాలన్న ప్రయత్నం మొదలైంది.
ఆ క్రమంలోనే సోనమ్ – ఆనంద్ అహూజా జంట వివాహానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఓవైపు మీడియా అత్యుత్సాహం చూపిస్తున్నా.. ఈ పెళ్లిని ఎంతో సైలెంటుగా లో ప్రొఫైల్‌లోనే ముగించాలని కపూర్ ఫ్యామిలీ భావిస్తోంది. అన్నయ్య పెళ్లి దగ్గరుండి జరిపిస్తానంటేనే ఈ పెళ్లి చేస్తానని అనీల్ కపూర్ అన్నారంటే.. ఆ ఇంటిని ఇంకా గడిచిన గతం ఎలా నీడలా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న మే 11, 12 తేదీల్లోనే వివాహం ఉంటుందని అన్నారు. కానీ ఇంకాస్త ముందుగానే ఈ వివాహం చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని తాజాగా వార్త అందింది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఈ పెళ్లి జరిపించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారట. అయితే కపూర్ ఇంటినుంచి అధికారికంగా దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఇంకా ఇదంతా బాలీవుడ్ మీడియా స్పెక్యులేషన్‌గానే భావించాలి. కొందరు స్విట్జర్లాండ్‌లో డెస్టినేషన్ పెళ్లి చేస్తున్నారని అంటుంటే, మరికొందరు ముంబైలోనే సైలెంటుగా ఈ వివాహం జరిపించేందుకు కపూర్ ఫ్యామిలీ ఏర్పాట్లు చేసుకుంటోందని చెబుతున్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండానే ఈ పెళ్లి తంతు కానిచ్చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే మీడియాకు సైతం హడావుడి చేసేందుకు ఆస్కారం లేకుండా చేస్తున్నారని ఒకటే ప్రచారం సాగుతోంది.