ప్రచురణ తేదీ : Apr 3, 2018 8:53 PM IST

పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే… :ఆ దర్శకుడు ఇంతకీ ఎవరిని తిట్టాడు..?

తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వటం లేదని, ఛాన్స్‌లకోసం వెళ్తే అమ్మాయిలతో కొంత మంది తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు అసభ్యకరంగా ప్రవర్తిస్తారని ఓ తెలుగు నటి ఇటీవల సోషల్ మీడియాలో హల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములను ఉద్దేశించి నిన్న ఫేస్‌బుక్‌లో ఆమె ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై శేఖర్ కమ్ముల సీరియస్‌గా స్పందించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు.

‘నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది.

నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.’అంటూ శేఖ‌ర్ క‌మ్ముల హెచ్చ‌రించారు.

స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.

Comments