ప్రచురణ తేదీ : Dec 27, 2016 1:26 PM IST

వాళ్లంతా రంగా, రాధాల పేర్లు చెడగొట్టడానికే పుట్టారన్న వర్మ

RGV
వంగవీటి సినిమాపై వస్తున్న ప్రకంపనలు ఇప్పుడప్పుడే ఆగేలా కనపడడంలేదు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉన్నారు. రంగ మిత్ర మండలి సభ్యులు దర్శకుడు రాంగోపాల్ వర్మని విమర్శిస్తూ… తాము షూటింగులో పాల్గొన్నప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలేవీ సినిమాలో లేవనీ, అసలు రంగా చేసిన సమాజ సేవ లాంటివేవీ ఈ సినిమాలో చూపించలేదని, అందువల్ల వాటిని కూడా కలిపి సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయాలని రంగా మిత్ర మండలి సభ్యులు డిమాండ్ చేశారు. రంగా జీవితం గురించి రాంగోపాల్ వర్మకు అసలేం తెలీదని, అందువల్లే ఆయనను వంగవీటి సినిమా తీయొద్దు అన్నానని రంగా కుమారుడు రాధాకృష్ణ అన్నారు.

దీనిపై స్పందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ పనీపాటా లేకుండా వీధుల్లో తిరిగే మీలాంటి వారు వంగవీటి రాధా, రంగాల పేర్లు చెడగొట్టడానికే పుట్టారని విమర్శించారు. నా దిష్టి బొమ్మలను మీరు తగలబెట్టవచ్చు కానీ, నేను మాత్రం మీ లోపలి కుళ్ళును పెట్రోల్ కూడా లేకుండా తగలబెడతానని ఆయన హెచ్చరించారు. తాను క్షమాపణ చెప్పడం తరువాత సంగతి అని, ముందు మీరు మొరగడం ఆపకపోతే మీ అసలు జాతేంటో అందరికీ తెలిసిపోతుందని వర్మ ఘాటుగా బదులిచ్చారు.

Comments