ప్రచురణ తేదీ : Mon, Mar 20th, 2017

పవన్ తరపున చరణ్ ప్రచారం మొదలుపెట్టాడా ?


మొన్న ఆదివారం శిల్పకళావేదికలో ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఒంటరిగా మిగిలిపొయ్యారని చాలా మంది మాట్లాడారు. కానీ నిన్న జరిగిన పరిణామం చూస్తే అలా లేదు. మెగా కుటుంబమంతా ఆయన వెనకే ఉన్నట్టుంది. నిన్న రామ్ చరణ్ తేజ్ విజయనగరంలోని అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో ఒకే ఒక రాజకీయపరమైన మాట ఉంది. అది కూడా పూర్తిగా పవన్ ను ఉద్దేశించే మాట్లాడినట్లుంది.

నిన్న చరణ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఎవరినైనా స్టార్ ని చెయ్యాలన్నా మీరే, మీరు తలుచుకుంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చి తీరుతుంది. మీలో ఆ శక్తి ఉంది’ అన్నారు. ఈ మాటల్లో మీరు అనుకుంటే ఏ పార్టీనైనా అధికారంలోకి తీసుకురాగలరు అనే వాక్యాన్ని లోతుగా పరిశీలిస్తే ‘మీరు అనుకుంటే ఓట్లు వేసి జనసేనను అధికారంలోకి తీసుకురాగలరు’ అనే శబ్దమే ధ్వనిస్తున్నట్టు వినిపిస్తోంది.

అది కూడా పవన్ కు ఎక్కువ బలం ఉన్న యువతను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం చూస్తుంటే చరణ్ నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా బాబాయ్ కు సపోర్ట్ చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. మరి అంతర్గతంగా పవన్ మీద ఇంత అభిమానం, సుముఖత ఉన్న మెగా హీరోలు దాన్ని అలాగే అంతర్గతంగానే దాచిపెడతారో లేకపోతే 2019 ఎన్నికల నాటికి బయటికి తీసి ప్రజల ముందు పెడతారో చూడాలి.

Comments