ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

పిటి ఉష బ‌యోపిక్‌లో పీసీ?


ప‌రుగుల రాణిగా పిటి ఉష ప్ర‌పంచానికి సుప‌రిచితం. దేశ‌విదేశాల్లో త‌న‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధార‌ణం. అథ్లెటిక్స్‌ని విప‌రీతంగా ప్రేమించే దేశాల్లో మేటి అథ్లెట్‌ పీటీ ఉష‌ను ప్ర‌త్యేకంగా గౌర‌విస్తారు. ఏసియ‌న్ ఛాంపియ‌న్‌షిప్ విజేత‌గా, జాతీయ అవార్డు గ్ర‌హీత‌గా, ,,,మూడుసార్లు ఒలింపిక్‌లో పాల్గొన్న అథ్లెట్‌గా పిటి ఉష ఖ్యాతి జ‌గద్విదితం. అలాంటి మేటి క్రీడాకారిణి గురించి మ‌న‌వాళ్ల‌కు తెలిసింది త‌క్కువే. పాఠ్య పుస్త‌కాల్లో పాఠ్యాంశంగా పిటి ఉష జీవితాన్ని చ‌దువుకున్నా లోతైన విష‌యాలు మ‌న‌కు తెలియ‌నే తెలీవు. అందుకే త‌న జీవిత‌క‌థ‌తో సినిమా తీసేందుకు ముందుకొచ్చారు న‌టి కం డైరెక్ట‌ర్ రేవ‌తి. ఇప్ప‌టికే స్క్రిప్టు రెడీ చేసుకుని, బాలీవుడ్ క‌థానాయిక ప్రియాంక చోప్రాని ఒప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పీసీ కాల్షీట్లు దొర‌క‌డం అంత వీజీ కాదు. ఓవైపు హాలీవుడ్‌, మ‌రోవైపు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పీసీ ఆస‌క్తి ఉన్నా.. ఇంత‌వ‌ర‌కూ సంత‌కం చేయ‌లేదు. అయితే ఈ పాత్ర‌కు మేరీకోమ్‌గా అల‌రించిన పీసీ అయితేనే బెస్ట్ ఛాయిస్ అన్న‌ది రేవ‌తి ఆలోచ‌న‌. అందుకే త‌న‌కోసం వేచి చూస్తున్నారుట‌.

ఇక ఈ ప్రాజెక్టును దేశ‌, విదేశాల్లో రిలీజ్ చేసేలా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్‌తో తెర‌కెక్కించాల‌న్న‌ది ద‌ర్శ‌కురాలు రేవ‌తి ఆలోచ‌న‌. అందుకోసం ఏకంగా 100 కోట్ల బ‌డ్జెట్‌ని కేటాయిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వెన‌క మరో ఆస‌క్తిక‌ర విషయం ఏమంటే.. ద‌ర్శ‌కురాలు రేవ‌తి, అథ్లెట్ పి.టి.ఉష కేర‌ళ రాష్ట్రానికి చెందిన వారే కావ‌డం విశేషం. ఇక ఈ భారీ ప్రాజెక్టుకు సంగీత ద‌ర్శ‌కుడిగా స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్‌ని ఒప్పించే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

Comments