ప్రచురణ తేదీ : Jan 25, 2017 9:17 AM IST

పవన్ కళ్యాణ్ కు జై కొట్టిన నాగబాబు

nagababu
మెగా ఫ్యామిలీ మధ్యన విభేదాలు ఉన్నాయని, ఈ మధ్య అవి తారాస్థాయికి చేరుకున్నాయని వార్తలు వచ్చాయి. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు పవన్ హాజరుకాకపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి జనవరి 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతేకాదు తెలుగు యువతను, అభిమానులకు వరుస ట్వీట్లను పెడుతూ అందరినీ ఉత్సాహపరుస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గురించి అడిగితె కొంచెం అసహనం వ్యక్తం చేసిన నాగేంద్రబాబు ఇప్పుడు మాత్రం పవన్ గురించి స్పందించారు. ప్రత్యేక హోదా అంశానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడంపై నాగేంద్రబాబు తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఆ హక్కు కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు, ఇతర రాజకీయ పార్టీలకు, విద్యార్థులకు, మెగా అభిమానులకు, పవన్ అభిమానులకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదర్శాలతో, అతని ఆలోచనా విధానంతో తాను పూర్తిగా ఏకీభవిస్తానని, ఈ నెల 26న ఆర్కే బీచ్ లో చేపట్టిన శాంతి ర్యాలీ కి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Comments