ప్రచురణ తేదీ : Dec 28, 2016 9:58 AM IST

ఒక్క దెబ్బకు పలు పిట్టలు నేలరాలాయి అంటున్న మోడీ

modi1
ప్రధాని మోడీ తాను తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని మరొకసారి సమర్ధించుకున్నారు. తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యం అభివృద్ధి అనీ, దానికోసమే తాము నిరంతరం పని చేస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. నేను సరాసరి దొంగల ముఠా నాయకుడినే గురి చూసి కొట్టానని, నేను కొట్టిన దెబ్బకు నల్లకుబేరుల విలవిల్లాడుతున్నారని మోడీ అన్నారు. తగలాల్సిన వారికే దెబ్బ తగిలింది కాబట్టే ఈ నిర్ణయం కొంతమందికి నచ్చట్లేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు.

మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే పని చేస్తుందన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణలను మోడీ తిప్పి కొట్టారు. తమది పేదల ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా దేశంలో పేరుకుపోయిన అవినీతిని నోట్ల రద్దు నిర్ణయం ద్వారా శుభ్రం చేస్తున్నామని మోడీ చెప్పారు. నల్లధనం, తీవ్ర వాదులకు నిధులు, మనుషుల అక్రమ రవాణా, మాఫియా లాంటి వ్యవస్థలన్నీ పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ధ్వంసం అయ్యాయని మోడీ చెప్పారు. బీరువాలో, పరుపుల కింద నలుగుతున్న నల్లధనం నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకులకు చేరుతుందని ఆయన అన్నారు. దేశాన్ని నాశనం చేస్తున్న నల్లకుబేరులను దేశం తరిమికొట్టడం కోసం నేను కాపలాదారుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఈ పోరాటంలో, ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో నాకు అండగా నిలబడిన దేశప్రజలకు కృతజ్ఞతలు అని మోడీ చెప్పారు.

Comments