ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

ఆ వ్యక్తి తన కారు ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు….!

car
మనం వాచీలు, రిమోట్లు, చిన్న చిన్న వస్తువులు ఎక్కడోపెట్టి మరచిపోవడం సర్వసాధారణం. అలాంటివి ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి. అయితే ఒక వ్యక్తి మాత్రం విచిత్రంగా తన కారును ఎక్కడ పార్క్ చేసాడో మరచిపోయాడు. అతను కార్ ఎక్కడ పెట్టాడో మర్చిపోయి ఆరు నెలలు అయింది. అతను ఇప్పటివరకు కారును వెతుకుతూనే ఉన్నాడు. అయితే పోలీసులు ఆరు నెలల తరువాత ఆ కారు ను కనిపెట్టి మర్చిపోయిన అతని దగ్గరకు చేర్చారు. దీంతో అతను చాలా సంతోషపడ్డాడు.

యూకేకి చెందిన ఒక వ్యక్తి గత ఏడాది జూన్ లో మాంచెస్టర్ లో జరిగిన ఒక సంగీత కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇందుకోసం తన స్నేహితుడి బీఎండబ్ల్యూ కారు తీసుకుని స్కాట్లాండ్ నుండి మాంచెస్టర్ చేరుకున్నాడు. కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఒక చోట కారు పార్క్ చేసి ఉత్సాహంగా ఆ సంగీత వేడుకలో చిందులేశాడు. కార్యక్రమం అయిపోయి తిరిగి వచ్చిన తరువాత అతను తన కారు ఎక్కడ పార్క్ చేసాడో మరచిపోయాడు. ఐదు రోజుల పాటు చుట్టుపక్కల ఉన్న పార్కింగ్ ప్రాంతాల్లో గాలించాడు. అయినా అతనికి ఫలితం లభించలేదు. అతని స్నేహితుడు కూడా వచ్చి గాలించినా కారు జాడ తెలియలేదు. దీంతో ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారం రోజులక్రితం మాంచెస్టర్ సిటీ సెంటర్ కాంప్లెక్స్ లోని పార్కింగ్ లో చాలాకాలంగా దుమ్ము పట్టిపోయి ఒక కారు ఉందని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఆరా తీశారు. అది ఆరు నెలల క్రితం కారు పోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తిది అని తెలుసుకుని కారును అతనికి అప్పగించారు.

Comments