ప్రచురణ తేదీ : Fri, Sep 29th, 2017

రివ్యూ రాజా తీన్‌మార్ : మహానుభావుడు – ఈ దసరాని శుభ్రంగా కడిగేశాడు !

తెరపై కనిపించిన వారు : శర్వానంద్, మెహ్రీన్ కౌర్
కెప్టెన్ ఆఫ్ ‘మహానుభావుడు’ : మారుతి దాసరి

మూల కథ :

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనగా అతి శుభ్రత అనే లక్షణంతో ఉండే ఆనంద్ (శర్వానంద్) తనతో పాటు తన చుట్టూ ఉండే పరిసరాలు కూడా అంతే క్లీన్ గా ఉండాలని అనుకుంటాడు. అలా కాకుండా ఎవరైనా అశుభ్రతతో కనిపిస్తే వాళ్ళకి పెద్ద క్లాస్ పీకుతాడు, జబ్బుతో ఉంటే కనీసం అమ్మని కూడా దగ్గరకు రానివ్వడు.

అలాంటి లక్షణం కలిగిన ఆనంద్ తన మేఘనను ప్రేమిస్తాడు. మేఘన కూడా అతన్ని ప్రేమించినా ఒక సందర్భాల వలన తట్టుకోలేక బ్రేకప్ చెబుతుంది. అలా ఓసిడి వలన ప్రేమను కోల్పోయిన ఆనంద్ తిరిగి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు, ఓసిడికి, ప్రేమకి మధ్యన ఎలా నలిగిపోయాడు, చివరికి అతని జీవితం ఏమైంది అనేదే ఈ ‘మహానుభావుడు’ కథ..

విజిల్ పోడు :

–> సినిమా ఆరంభం నుండి చివరి వరకు నవ్వుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. హీరో పాత్ర తన పరిస్థితులకు స్పందించే సన్నివేశాలన్నీ చాలా నవ్విస్తాయి. ఒక సాధారాణ ప్రేక్షకుడికి కావాల్సిన ఫన్ ఈ సినిమాలో పుష్కలంగా దొరుకుతుంది. ఈ అంశాలకి మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> దర్శకుడు మారుతి ఒక చిన్న అంశాన్ని తీసుకుని 2 గంటల సేపు వినోదాన్ని పండించిన తీరు ఆకట్టుకుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను నడిపారాయన. రెండో విజిల్ మారుతికి వేయొచ్చు.

–> హీరో శర్వానంద్ అయితే ఓసిడి కలిగిన హీరో పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. బాడీ లాంగ్వేజ్ దగ్గర్నుంచి ఇరిటేట్ అయ్యే సందర్భాలు, ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. మూడో విజిల్ ఆయనకు వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా ఫస్టాఫ్ కొంత నెమ్మదిగానే మొదలవుతుంది. హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో కాస్త నిరుత్సాహం కలిగింది.
–> ఇక ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చాలా సినిమాలలాగే రొటీన్ గా ఉంది. అందులో పెద్దగా కొత్తదనమేదీ కనబడలేదు.
–> ఇక సినిమా కథ, కథనాలను పూర్తిగా ముందుగానే ఊహించేయవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఈజీగా కనిపెట్టొచ్చు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ సినిమాలో పాత్రలు. కథ, కథనం అన్నీ నార్మల్ గానే ఉన్నాయి.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా బాగుంది కదరా.. !
మిస్టర్ బి : బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్.
మిస్టర్ ఏ : అయితే ఈ దసరా విన్నర్ శర్వానే కదా ?
మిస్టర్ బి : మరి.. శుభ్రంగా కడిగేశాడుగా మహానుభావుడు.

Comments