`కాలా-కరికేయన్` వర్సెస్ భాయ్!
క్లాష్ ఆఫ్ ది టైటాన్స్! ఇద్దరు దిగ్గజాలు ఢీకొనేప్పుడు పుట్టే పదం ఇది. ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే భారీ సినిమాల క్లాషెస్ అనూహ్యంగా తెరపైకొచ్చినట్టయింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ `కాలా-కరికేయన్`, భాయ్ సల్మాన్ ఖాన్ -రేస్ 3 మధ్య హోరాహోరీ తప్పేట్టు లేదు. ఈ ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద అసాధారణ రికార్డులున్న స్టార్లు. అందుకే ఈద్ (జూన్) బరిలో ఈ ఇద్దరి హవా సాగడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. ఈ సమ్మర్ మరింత హీట్‌తో మరిగిపోయే రేంజులో దాదాపు 1000 కోట్ల మేర బాక్సాఫీస్ వద్ద భారీ బెట్టింగ్ ఈ ఇద్దరి సినిమాలతో తప్పదని ట్రేడ్ అంచనా వేస్తోంది.
వాస్తవానికి రజనీకాంత్ `కాలా` ఈనెల 27న రిలీజ్ కావాల్సి ఉన్నా, అనూహ్య కారణాలతో వాయిదా పడింది. తాజాగా కాలా నిర్మాతలు.. లైకా అధినేతలు ఈద్ (జూన్ 15) కానుకగా `కాలా -కరికేయన్` రిలీజ్ చేసే ఆలోచన ఉందని వెల్లడించడం ఒక్కసారిగా సమీకరణాలు మార్చేసింది. సల్మాన్ భాయ్ ఇదివరకూ ఫిక్స్ చేసుకున్న తేదీకే రజనీ కూడా వార్‌లోకి వస్తుండడంతో ఈ ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టడం ఖాయమైంది. సల్మాన్ సినిమా ఇప్పటికే 400 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసుకుంటోందని సమాచారం అందింది. ఇక రజనీ సినిమా 200-300 కోట్ల మేర బిజినెస్ చేస్తుంది.. కాబట్టి ఆ మేరకు వసూళ్లు అంతే స్థాయిలో ఉంటాయి. కబాలి ఘనవిజయంతో తమిళం, మలేషియాలో రజనీ హవా సాగనుందన్న అంచనాల నడుమ .. కాలాకు భారీ వసూళ్లకు ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇక తెలుగులో కాలా పరిస్థితిపై వేరొక సందర్భంలో చర్చిద్దాం.