ప్రచురణ తేదీ : Nov 8, 2017 8:37 PM IST

ఎన్టీఆర్ ని నిజంగానే దేవుడనుకుని..అదే ఫస్ట్ షాట్..!

ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలకృష్ణ అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో వివాదభరిత అంశాలకు చోటు ఇవ్వకూడదనే వాదనతో దర్శకుడు తేజ ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జీవిత మంతా ఓ స్వర్ణ యుగం. కానీ లక్ష్మి పార్వతి ఎంట్రీ ఇచ్చాక వివాదాలు మొదలయ్యాయి. దీనితో ఆమె పాత్ర లేకుండా కథని సిద్ధం చేయాలని బాలయ్య తేజకు సూచించినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్ర కథ గురించి అప్పుడే లీకులు కూడా మొదలయ్యాయి.

అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, పివి నరసింహారావుతో కలసి కారులో తిరుపతి వెళుతుంటుంది. రోడ్డుకు ఇరువైపులా శ్రీకుష్ణుడు, రాముడి కటౌట్లు కనిపించడంతో దేవుడి ఉత్సవం జరుగుతుందని ఇందిరా భ్రమ పడుతుంది. దీని గురించి పివిని అడగగా అతడు దేవుడు కాదని మన ప్రత్యర్థి ఎన్టీఆర్ అని చెప్పడంతో ఆశ్చర్య పోవడం ఇందిర వంతు అవుతుంది. కారులోనే ఎన్టీఆర్ గురించిన వివరాలు మొత్తం ఇందిరా అడిగి తెలుసుకుంటారు. ఈ సన్నివేశాన్నే చిత్ర ఓపెనింగ్ షాట్ గా వాడుకోవాలని తేజ భావిస్తున్నాడట. కాగా ఎన్టీఆర్ చివరి రోజులని మాత్రం సో సో గా మాత్రమే చూపిస్తారట. ఈ మేరకు ప్రధాన మీడియా సంస్థలలో వార్తలు వస్తున్నాయి.

Comments