ప్రచురణ తేదీ : Thu, Jan 5th, 2017

హైదరాబాద్ యువకుడికి సౌదీలో 300 కొరడా దెబ్బలు

poor
హైదరాబాద్ నుండి ఉద్యోగం కోసం రియాద్ వెళ్లిన హైదరాబాద్ యువకుడు అక్కడ ఒక దొంగతనం కేసులో ఇరుక్కున్నాడు. ఈ కేసుకు సంబంధించి సౌదీ కోర్ట్ అతనికి ఒక సంవత్సరం జైలు, 300 కొరడా దెబ్బలు శిక్ష విధించింది. అయితే హైదరాబాదులో ఉన్న అతని తల్లితండ్రులు మాత్రం తమ కొడుకు నిర్దోషని, తమ కొడుకును అన్యాయంగా అక్కడి కోర్టులు శిక్షిస్తున్నాయని వాపోతున్నారు. కొడుకును కాపాడుకోవడానికి ఆ తల్లితండ్రులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కొడుకును కాపాడాలని ఆ తల్లితండ్రులు విదేశాంగ శాఖా మంత్రి సుష్మ స్వరాజ్ ను వేడుకుంటున్నారు.

హైదరాబాద్ మలక్ పేట్ కు చెందిన మహమ్మద్ మన్సూర్ హుస్సేన్ ఎంబీఏ చదివి 2013 నుండి రియాద్ లో పని చేస్తున్నాడు. అతను గత సంవత్సరం ఆగష్టు 25న 1.06 లక్షల సౌదీ రియళ్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా గుర్తు తెలియని కొందరు దుండగులు అతడిని తుపాకీతో బెదిరించి అతని దగ్గర ఉన్న నగదును దోచుకున్నారని హుస్సేన్ తల్లితండ్రులు చెప్తున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనంపై వాళ్ళు పారిపోయారని చెప్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులకు చెప్పగా వారు తమ కుమారుణ్ణి అరెస్ట్ చేయించారని హుస్సేన్ తల్లి హూరున్నీసా చెప్పారు. అతడు ఇంతకుముందు కూడా తమ కుమారుడు 15 లక్షల రియాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసాడని, ఇప్పుడు ఇంత చిన్న మొత్తానికి ఆలా ఎందుకు చేస్తాడని వాళ్ళు అంటున్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయంపై సాయం చేయాలని సుష్మాను కోరారు. సౌదీ లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై వీలైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Comments