ప్రచురణ తేదీ : Dec 31, 2016 12:02 PM IST

కాంగ్రెస్ తో కలిసి తండ్రిని ముంచబోతున్న తనయుడు…?

akhilesh-yadav
ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన స్వంత కొడుకు, ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ ను, ఆయన సన్నిహితుడు రాంగోపాల్ యాదవ్ ను ఆరు సంవత్సరాలపాటు పార్టీ నుండి బహిష్కరించడం సంచలనం సృష్టిస్తుంది. ములాయం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆగ్రహించిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమాజ్ వాది పార్టీ నుండి పూర్తిగా బయటకు వచ్చి స్వంత పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన స్వంత పార్టీ పెడితే ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అఖిలేష్ తన తదుపరి కార్యాచరణను ప్రకటించడానికి శనివారం తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ తరువాత ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.

మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ చెప్పారు. ఆరు సంవత్సరాలపాటు అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుండి బహిష్కరించిన ఈ పరిస్థితులలో గవర్నర్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొని, తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా కోరే అవకాశం కూడా ఉందంటున్నారు. 72 గంటల లోపే బలపరీక్షకు సిద్ధపడాలని గవర్నర్ ఆదేశిస్తారని అంటున్నారు.

Comments