ప్రచురణ తేదీ : Sun, Apr 29th, 2018

అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కాపీ చేసారా..?

మార్వెల్‌ స్టూడియోస్‌ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద హాలీవుడ్ రికార్డులు బద్దలు కొడుతుంది. విలన్ థానోస్ నుంచి కాపాడేందుకు సూపర్ హీరోలు చేసే సాహస విన్యాసాలు, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు… భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌ ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేశాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు కాపీ చేశారన్న కామెంట్లు హాలీవుడ్ సినీ పరిశ్రమలో వినిపించడం మొదలైంది. హ్యారీ పాటర్ సిరీస్‌లోని సన్నివేశాలను ఎత్తేసి ఇన్ఫినిటీ వార్‌ను రూపొందించారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా ఇన్ఫినిటీ సిరీస్ లోని చాలా ముఖ్యమైన సన్నివేశాలను.. హ్యారీ పోటర్‌ అండ్‌ ది డెత్లీ హాలోస్‌లోని సీన్లతో పోలుస్తూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. హ్యారీ పాటర్‌ సిరీస్‌ల్లోని ది సెంట్రల్‌ క్వెస్ట్‌.. వోల్దెమార్ట్‌ చనిపోయే సన్నివేశం.. డీమెంటర్స్‌-రెడ్‌స్కల్‌ మధ్య పోలికలు.. మ్యాడ్ఊ మూడీ కన్నును థోర్‌ కంటితో పోలుస్తూ కాపీ కొట్టారంటూ తీవ్ర స్థాయిలో వాదిస్తున్నారు. మరికొందరు జేకే రౌలింగ్‌(హ్యారీ పాటర్‌ రచయిత్రి) నుంచి రాయల్టీ తీసుకోవాల్సిందేనంటూ కొన్ని చమక్కులు పేలుస్తున్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే విదేశీ మార్కెట్‌తోపాటు భారత్‌లోనూ అవెంజర్స్‌ ప్రభంజనం కొనసాగుతోంది. తొలిరోజు రూ. 30 కోట్లు(2000 వేల స్క్రీన్లలో మాత్రమే విడుదలైంది) వసూలు చేసిన ఈ చిత్రం.. వీకెండ్‌లో భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది.
ఇన్ఫినిటీ స్టోన్స్‌ సాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే విలన్ థానోస్.. అతని నుంచి ప్రపంచాన్ని కాపాడానికి సూపర్ హీరోలు.. వాళ్లు చేసే పోరాటాల నేపథ్యంతో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఆంథోని రుస్సో, జోయ్‌ రుస్సో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాబర్ట్ డౌనీ జూనియర్(ఐరన్‌ మ్యాన్‌), క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటించారు.

Comments