ప్రచురణ తేదీ : Sun, Aug 13th, 2017

6 వేల కోట్లకి వారసుడు! కాని హైదరాబాద్ లో కూలి వాడిగా? ఎందుకంటే?


ఈ మధ్య వచ్చిన బిచ్చగాడు సినిమాలో హీరో వేల కోట్లకి వారసుడు, కాని తల్లి బ్రతకాలని ఆశతో నెల రోజుల పాటు బిచ్చగాడిగా తన గుర్తింపుని చంపుకొని బ్రతుకుతాడు. అలాగే ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసి ఉంటాం వేల కోట్లు ఆస్తి ఉండి కూడా అనాధలా బ్రతికే వాళ్ళని. ఇప్పుడు అలాగే నిజ జీవితంలో జరిగింది. గుజరాత్ లో ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి వారసుడు. దాదాపు రూ. 6 వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే అధిపతి. అయితేనేం… తండ్రి ఆజ్ఞ మేరకు ఓ అనామకుడిగా, జేబులో రూ. 500తో హైదరాబాద్ చేరుకుని నెల రోజుల పాటు కూలీగా పనిచేశాడు. తండ్రి సూచించినట్టుగా బతికి చూపించాడు. సామాన్య బతుకు ఎలా ఉంటుందో రుచి చూశాడు. అతని పేరు హితార్థ్. హరేకృష్ణ ఎక్స్ పోర్ట్స్ యజమాని ఘన్ శ్యాం డోలాకియా కుమారుడు. నెల రోజుల అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత, అతని సోదరి కృపాలి, పెదనాన్న తదితరులు హైదరాబాద్ రాగా, మొత్తం విషయాన్ని ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది మీడియాకు తెలిపారు.

కేవలం తండ్రి ఇచ్చిన ఫ్లైట్ టికెట్ జేబులో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిన తర్వాత తాను హైదరాబాద్ కి వెళ్తున్న విషయం హితార్ద్ కి తెలిసింది. విమానాశ్రయంలో దిగిన తరువాత బస్సులో సికింద్రాబాద్ చేరుకున్నాడు. రూ. 100కు ఒక హోటల్ లో మంచం తీసుకుని ఒక్కరోజు మాత్రమే ఉన్నాడు. తాను ఉద్యోగం కోసం వచ్చానని, రైతు కుటుంబీకుడినని చెప్పాడు. ఉద్యోగాలు లభించే ప్రాంతాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో సలహాను ఇవ్వగా, ఓ బస్సు కండక్టర్ సూచన మేరకు అమీర్ పేట వెళ్లి ప్రయత్నించాడు.

హైటెక్ సిటీలో ఓ కంపెనీలో చేరి అక్కడ ఇమడలేక, మానేసి మెక్ డీ అనే కంపెనీలో చేరాడు. దాన్నీ మానేసి నైకీలో, ఆడిడాస్ లో వారం చొప్పున పనిచేశాడు. ఆపై సికింద్రాబాద్ లోని వైట్ బోర్డు తయారీ సంస్థలో కుదురుకున్నాడు. కొన్ని రోజులు రిక్షా కార్మికుడితో, మరికొన్ని రోజులు సాధువుతో కలసి ఓ గదిలో బతికాడు. నిత్యమూ రోడ్డు పక్క లభించే ఆహారాన్ని తిన్నాడు. నెల రోజుల తరువాత తానెక్కడున్నానన్న విషయాన్ని వెల్లడించగా, అతని బంధువులంతా ఒక్కసారిగా వాలిపోయి అతని కష్టం చూసి కన్నీరు పెట్టుకున్నారు. తాను ఓ సాధారణ యువకుడిగా కనిపించలేక పోయానని, అయితే, తనకు తారసపడిన వారంతా సాయం చేయాలనే చూశారని హితార్థ్ వెల్లడించారు. ఈ నెల రోజుల జీవితం ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నారు. హితార్థ్ సోదరుడు గతంలో ఇదే విధంగా అజ్ఞాతవాసం చేసి కేరళలో కూలీగా పనిచేస్తూ నెల రోజులు గడిపాడు.

Comments