ప్రచురణ తేదీ : Jan 3, 2018 3:47 AM IST

సంక్రాంతి అల్లుడు : అప్పుడు శ‌ర్వా.. ఇప్పుడు రాజ్‌త‌రుణ్‌!?

కొత్త సంవ‌త్స‌రంలో సంక్రాంతి కానుక‌గా భారీ చిత్రాలు బ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, గ‌జిని సూర్య ఈసారి సంక్రాంతికి పందెం పుంజుల్లా బ‌రిలో దిగుతున్నారు. ఒక‌రితో ఒక‌రు నువ్వా? నేనా? అంటూ పోటీప‌డుతున్నారు. ఆజ్ఞాత‌వాసి- జై సింహా మ‌ధ్య‌నే ప్ర‌ధాన పోటీ అని భావిస్తున్న త‌రుణంలో ఉన్న‌ట్టుండి గ‌జినిలా ఎంట‌ర‌య్యాడు సూర్య‌. అత‌డు న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ `గ్యాంగ్‌` టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద వార్‌కి రెడీ అవుతోంది. అయితే ఆ ముగ్గురి మ‌ధ్య‌నే పోటీ అనుకుంటుండగా ఉన్న‌ట్టుండి సైలెంటుగా షాకిచ్చాడు రాజ్ త‌రుణ్‌. ఈ యంగ్ హీరో కాన్ఫిడెన్స్ ఏమో కానీ.. స‌డెన్‌గా సంక్రాంతి యువ‌ పుంజులా బ‌రిలో దిగాడు.

ఆ మేర‌కు రాజ్ త‌రుణ్ న‌టించిన `రంగుల రాట్నం` సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతోందంటూ ప్ర‌తిష్ఠాత్మ‌క అన్న‌పూర్ణ స్టూడియోస్ ట్విట్ట‌ర్‌లో అధికారికంగా ప్ర‌క‌టించింది. రాజ్ త‌రుణ్ హీరోగా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ నిర్మించిన‌ `రంగుల రాట్నం` సినిమాతో సెల్వ‌రాఘ‌వ‌న్ అసిస్టెంట్‌ శ్రీ రంజిని ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అవుతోంది. `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`, `అంధ‌గాడు` సినిమాల‌తో స‌క్సెస్ జోరుమీదున్న రాజ్‌త‌రుణ్ ఈ ఏడాది కూడా త‌న హ‌వా చాట‌నున్నాడ‌నే అర్థ‌మ‌వుతోంది. 2017 సంక్రాంతికి `ఖైదీనంబ‌ర్ 150`, `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` వంటి భారీ చిత్రాల‌తో పోటీప‌డి శ‌ర్వానంద్ `శ‌త‌మానం భ‌వ‌తి` బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. ఈసారి ఆజ్ఞాత‌వాసి, జైసింహా, గ్యాంగ్ వంటి భారీ చిత్రాల‌తో పోటీప‌డుతూ రాజ్ త‌రుణ్ ఎలాంటి మిరాకిల్స్ చేయ‌బోతున్నాడో అన్న ఆస‌క్తి రెయిజ్ అయ్యింది. రాజ్ త‌రుణ్ సంక్రాంతి అల్లుడిగా ఉట్టి కొడ‌తాడా? లేదా? అన్న‌ది చూడాలి.

Comments