ప్రచురణ తేదీ : Dec 22, 2017 2:37 AM IST

రివ్యూ రాజా తీన్‌మార్ : మిడిల్ క్లాస్ అబ్బాయి – మధ్యలోనే చేతులెత్తేశాడు

తెరపై కనిపించిన వారు: నాని, సాయి పల్లవి, భూమిక

కెప్టెన్ ఆఫ్ ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ : వేణు శ్రీరామ్

మూల కథ :

నాని (నాని)కి తన అన్న(రాజీవ్ కనకాల) అంటే చాలా ఇష్టం. కానీ అన్నకు పెళ్ళై వదిన జ్యోతి (భూమిక) వాళ్ళ మధ్యకు రాగానే వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. దాంతో వదినపై కోపంపెంచుకుంటాడు నాని.

ఆ గొడవలా సాగుతుండగా ప్రభుత్వ ఉద్యోగి అయిన జ్యోతికి లోకల్ రౌడీ వరంగల్ శివతో గొడవ మొదలవుతుంది. దాంతో శివ ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. దానికి నాని అడ్డుపడతాడు. శివ, నానీలు ఒకరితో ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ ఛాలెంజ్ ఏంటి ? నాని శివ నుండి వదినను ఎలా కాపాడుకున్నాడు ? అనేదే తెరపై నడిచే చిత్రం.

విజిల్ పోడు :

–> కథ పరమ పాతదే అయినా హీరో నాని తన నటనతో చాలా వరకు మ్యానేజ్ చేశాడు. మిడిల్ క్లాస్ కుర్రాళ్ళు ఎలా ఉంటారో కళ్ళకు కట్టినట్టు చూపాడు. దాంతో చాలా చోట్ల చిరాకు కలిగే ప్రమాదం తప్పింది. కాబట్టి నాని నటనకు మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక కథ పాతది కావడంతో దర్శకుడు త్వరగా కథలోని ప్రవేశించకుండా ఫస్టాఫ్ ను చాలా సేపటి వరకు నాని, భూమిక, సాయి పల్లవుల మధ్యన సన్నివేశాలతో నడుపడంతో కొంత ఆహ్లాదం, సాసక్తి కలిగాయి. కాబట్టి ఈ ఫస్టాఫ్ కు రెండో విజిల్ వేసుకోవచ్చు.

–> ఇకపోతే వదినగా భూమిక, నాని ప్రేయసిగా సాయి పల్లవి, విలన్ పాత్రదారుడు తమ నటనతో మెప్పించారు. మూడో విజిల్ వీరందరికీ కలిపి వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా ఇంటర్వెల్ సమయానికి అసలు కథలోకి ప్రవేశించడంతో బోర్ కొట్టడం మొదలైంది. ఎందుకంటే కథ చాలా రొటీన్, పాతది కాబట్టి.

–> సెకండాఫ్ ఆరంభం నుండి చివరి వరకు దాదాపు ప్రతి సన్నివేశాన్ని మనం సులభంగా ఊహించవచ్చు. పైగా సీన్లలో కొత్తదనం లేకపోవడంతో బోర్ కొట్టేసింది.

–> సాధారణంగా దేవి శ్రీ ప్రసాద్ అంటే సినిమా ఎలా ఉన్నా పాటలు బాగంటాయి. కానీ ఇందులో పాటలన్నీ తేలిపోయాయి. సంగీతం పెద్దగా ఇంప్రెస్ చేయలేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> హీరో సినిమా చివర్లో విలన్ ను అరెస్ట్ చేయడానికి ఆధారాల్ని సంపాదించే సన్నివేశం మరీ విచిత్రంగా ఉంటుంది.
చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

–> మిస్టర్ ఏ : ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ మధ్యలోనే చేతులెత్తేశాడు.
–> మిస్టర్ బి : అవును.. నాని లేకుంటే ఆ పని ఆరంభంలోనే జరిగుండేది.
–> మిస్టర్ ఏ: నాని నటనకి తోడు కథనం కొత్తగా ఉంటే భలే ఉండేది.

Comments