ప్రచురణ తేదీ : Jan 11, 2018 2:21 PM IST

పాదయాత్రలో వైఎస్ జగన్ మరొక రికార్డు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వై ఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి ఇటీవల రాష్ట్రం లో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న విషయం అందరికి విదితమే. నవంబర్ 6 న ఇడుపులపాయ నుండి ప్రారంభమయిన ఆయన ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా ఎటువంటి ఆటం లేకుండా విజయవంతంగా ముందుకు సాగుతూ 800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. వరుసగా కర్నూల్, కడప, అనంతపురం జిల్లాల ను దాటుకుని ప్రస్తుతం చిత్తూర్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే నేడు చిత్తూర్ జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం లోని నల్లవెంగణపల్లి వద్ద ఆయన ఈ మైలు రాయిని చేరుకున్నారు. పాదయాత్ర లో భాగంగా జగన్ వెంట వేలాదిగా ప్రజలు, యువత భారీగా వస్తూ తమ వంతు మద్దతు తెలుపుతున్నారు.

తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా, కాళ్లకు దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా ప్రజలే ముఖ్యమంటూ జగన్ ఈ యాత్రను నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే చిత్తూర్ చంద్రబాబు సొంత జిల్లా కావడం తో జగన్ పార్టీ లో ఏ నాయకుడు చేరతాడో అన్న భయం కొంత టిడిపి ని వెంటాడుతోంది. జిల్లాలో పార్టీకి బీటలు పడకుండా తెలుగుదేశం అధిష్ఠానం కూడా గట్టిగానే వ్యవహరిస్తోన్నట్లు తెలుస్తోంది. అయినా అక్కడక్కడా చిన్న నేతలు టిడిపి ని వీడి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరుతూనే వున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత కుంభ రవిబాబు చేరిక జగన్ పార్టీ లో కొంత నూతనోత్సవాహం నింపిందని చెప్పుకోవాలి.

Comments