ప్రచురణ తేదీ : Apr 15, 2018 10:44 PM IST

చంద్రబాబుకు వైసిపి నేత సవాల్ !


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అలానే విపక్ష వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయిలో జరుగుతోంది. ఓ వైపు జగన్ పాదయాత్రను టీడీపీ నేతలు టార్గెట్ చేస్తుంటే, మరోవైపు ప్రత్యేక హోదాపై చంద్రబాబు అప్పుడొక మాట, ఇప్పుడొక మాట మాట్లాడుతూ తెలివిగా వ్యవహరిస్తున్నారని వైసిపి నేతలు అంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని అంటున్న చంద్రబాబు అందులో నిజాయితీ ఉంటే రాజీనామాలకు సిద్ధమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో విజయసాయిరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొమ్ములు కూడబెట్టుకొని విదేశాల్లో దాచుకునేందుకే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నాడని విమర్శించారు. టీడీపీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే టీడీపీకి చెందిన ఎంపీలు అసెంబ్లీ శాసనమండలిలోని మొత్తం సభ్యులందరూ రాజీనామా చేసి ప్రజల్లోకి వెళదామని ప్రజా తీర్పును కోరదామని అన్నారు. ఏపీ ప్రజలు నిజంగా ప్రత్యేకహోదా కోరుకుంటున్నారా లేదా అనేది ప్రజాతీర్పు ద్వారానే తెలుసుకుందామంటూ చంద్రబాబుకు సవాల్ చేశారు. ప్రత్యేకహోదా అనేది సంజీవనేనని కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానీయకుండా చేసిన ఘనత టీడీపీదేనని కొన్ని రాజకీయపార్టీలతో లాలూచీపడి ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.

చంద్రబాబు అవకాశాన్ని బట్టి మాట మార్చే వ్యక్తి అని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం పోరాడుతున్న నాయకులు ఆంధ్రరాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీన వైఎస్ ఆర్ సీపీ – వామపక్షాలు ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ వల్ల ప్రయోజనం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎన్నిసార్లు బంద్ లకు పిలునిచ్చిందో గుర్తు చేసుకొండి చంద్రబాబు గారు అని సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కి బుద్ధి చెప్పే రోజు అతి దగ్గర్లో ఉందని అన్నారు…..

Comments