ప్రచురణ తేదీ : Jan 26, 2017 8:19 AM IST

ఈ రోజు విశాఖలో ఏం జరగబోతుంది…?

vizag
ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే వైజాగ్ రెండు రోజుల నుండి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చేసిన మోసం గురించే మాట్లాడుకున్నారు. ఎవరిని కదిపినా ఏదో భావోద్వేగం కనిపిస్తుంది. ఒకవైపు పెట్టుబడి దారుల భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుండి వేలాదిమంది అతిధులు వస్తున్నారు. మరొకవైపు ప్రత్యేక హోదా డిమాండ్ తో యువత తలపెట్టిన మౌన దీక్షకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో గురువారం వైజాగ్ లో ఏం జరగబోతుందో తెలియని పరిస్థితి.

అయితే పోలీసులు మాత్రం ఈ దీక్షలకు అనుమతి లేదని, ఎవరు ఎలాంటి ప్రదర్శనలు చేసినా అడ్డుకుంటామని చెప్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ బలగాలన్నీ బుధవారం మధ్యాహ్నం నుండే వైజాగ్ రోడ్లపై బందోబస్తు చేపట్టాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాధ్ బీచ్ లో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆంధ్ర యువత జిల్లా కోర్టుకు వెళ్లి న్యాయవాదులను కలిసి మౌన ప్రదర్శనకు మద్దతు కోరారు. జనసేన కార్యకర్తలు కూడా వైజాగ్ లోని చాలా కాలేజీలకు వెళ్లి మౌన ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ మౌన ప్రదర్శనకు ప్రతిపక్ష నేత జగన్ హాజరవుతానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చేదీ రానిదీ ఇంకా తెలియలేదు. వీరిద్దరిని ఈ మౌన ప్రదర్శనకు రాకుండా అడ్డుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఇద్దరినీ అడ్డుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని పోలీసులు ఆలోచిస్తున్నారు. వారిద్దరినీ వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాకుండా ఆపి, అక్కడే ఏదైనా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి తిరిగి శంషాబాద్ లో దింపితే ఎలా ఉంటుందని పోలీసులు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటే ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి… జగన్ ను అడ్డుకుంటే ఏం అవుతుంది.. వాటిని ఎలా అడ్డుకోవాలో పోలీసులు ప్రణాళిక రచిస్తున్నారు.

Comments