చతుర్ముఖ పోరులో ఆ నియోజకవర్గం ఎవరికి దక్కేను?

గత ఎన్నికల సమయంలో అధికార టీడీపీ పార్టీ, అటు కేంద్రంలో బీజేపీతో ఇటు, రాష్ట్రంలో జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి జనసేన పార్టీ కూడా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతుండడంతో రాష్ట్రంలోని స్థానాల్లో అభ్యర్థుల మధ్య పోటీ కొంత ఆసక్తిగా మారుతోంది. ఇక ప్రస్తుతం విశాఖ జిల్లాలోని అన్ని నియోజక వర్గాలు మంచి రసవత్తరమైన పోటీకి సిద్ధమవుతుండగా, ఇక ఉత్తర నియోజక వర్గంలో మాత్రం ఈ పోటీ మరింత తీవ్ర తరం కానున్నట్లు రాజకీయ వర్గాలనుండి సమాచారం అందుతోంది. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున గెలిచిన విష్ణుకుమార్ రాజు ఈ సారి కూడా అదే పార్టీ నుండి పోటీ చేస్తారా, లేక మరొక పార్టీ లోకి వెళ్తారా అనే సందేహాన్నీ కొందరు అక్కడి పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ విషయం అటుంచితే, విష్ణు కుమార్ రాజుకు పార్టీ పరంగా కంటే పలుకుబడిగల వ్యక్తిగా అక్కడి స్థానికుల్లో మంచి పేరుందట. మరోవైపు టీడీపీకి అక్కడ ఇప్పటివరకు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ కూడా ఇంచార్జి లేకపోవడం కొంత సమస్యగా చెప్పవచ్చు.

అయితే మంచి పట్టున్న వ్యక్తికి అవకాశం ఇస్తే టీడీపీ కూడా గెలిచే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఇక వైసిపి అధినేత జగన్ ఈ నియోజకవర్గం పై కూడా గట్టిగా దృష్టి పెట్టారని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఇక్కడ కాస్త బలహీనంగా వున్నా పార్టీని పైకి తీసుకురావాలని సరైన సమన్వయకర్తలను నియమించేలా చూస్తున్నారట. అంతే కాదు పోటీలో నిలబడే అభ్యర్థి విషయంలోనూ ఆయన తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జనసేనపై మాత్రం కాస్త నమ్మకం తక్కువైనప్పటికీ కూడా, తొలిసారిగా ఎన్నికల బారీలోకి దిగడం, ఒకవేళ మంచి పట్టున్న అభ్యర్థిని కనుక నిలబెట్టి పవన్ చరిష్మా ఉపయోగించి ఇక్కడకనుక ఆయన గట్టిగా పర్యటనలు చేస్తే ఆ పార్టీ నేత కూడా గెలిచే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇన్ని విధాలుగా చూస్తుంటే ఈ నియోజకవర్గంపై రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు కూడా ఈ సారి చతుర్ముఖ పోరులో గెలుపు మాదంటే మాదే అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అంతిమంగా ప్రజలు ఏ పార్టీ అభ్యర్ధికి పట్టం కడతారో తెలియాలంటే రాబోయే ఎన్నికల వరకు ఆగవలసిందే మరి…

Comments