ప్రచురణ తేదీ : Apr 8, 2018 2:46 PM IST

శ్రీరెడ్డి కి మా సభ్యత్వం ఎప్పటికీ ఇవ్వం : మా అసోసియేషన్

టాలీవుడ్ లోని క్యాస్టింగ్ కౌచ్ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాకపోవడం పై నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నిన్న ఫిల్మ్ చాంబర్ వద్ద శ్రీరెడ్డి `అర్ధనగ్న` ప్రదర్శన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో టాలీవుడ్ పై శ్రీరెడ్డి ఆరోపణలపై తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై తొలిసారిగా `మా` సభ్యులు స్పందించారు. ఫిల్మ్ చాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధనగ్నంగా ఆందోళన తెలపడంపై మా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరెడ్డికి `మా`సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని మా సభ్యులు తేల్చి చెప్పారు. నిన్నటి ఘటనపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో `మా` అధ్యక్షుడు శివాజీ రాజాతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

శ్రీరెడ్డి చేసిన పని టాలీవుడ్ ను అల్లరిపాలు చేసేలా ఉందని, వివాదం చేస్తే మా సభ్యత్వం వస్తుందని శ్రీరెడ్డి భావించటం సరైనది కాదని మా అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. తెలుగు ఇండస్ట్రీకి వేలాదిమంది మా సభ్యత్వం కోసం చాలామంది దరఖాస్తు చేసుకుంటారని తెలిపారు. ఆ దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన మీదటే వారికి కార్డు మంజూరుచేస్తామని తెలిపారు. శ్రీరెడ్డికి కూడా అప్లికేషన్ ఫాం ఇచ్చామని కానీ ఆమె పూర్తి వివరాలు ఇవ్వలేదని తెలిపారు. శ్రీరెడ్డి అబద్దాలు చెబుతోందని కేవలం పబ్లిసిటీ కోసం ఆమె నాటకాలాడుతోందని ఆయన అన్నారు.

శ్రీరెడ్డి అప్లికేషన్ ను తిరస్కరిస్తున్నామని అలానే ఆమె పై లీగల్ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మా సభ్యులెవరు ఆమెతో కలిసి నటించరని, ఒక వేళ ఎవరైనా నటిస్తే వారిని కూడా సస్పెండ్ చేస్తామని శివాజీరాజా అన్నారు. శివాజీరాజా అభిప్రాయంతో హీరో శ్రీకాంత్ కూడా ఏకీభవించారు. అటువంటి ఘటనలను టాలీవుడ్ లో ఇంతవరకు చూడలేదని ఆయన అన్నారు. `మా` అసోషియేషన్ కు తెలంగాణ ఫిలిం చాంబర్ మద్ధతు తెలిపింది. అయితే పెను దుమారం రేపుతున్న ఈ ఘటన పై మా సభ్యుల తీర్పు పై శ్రీరెడ్డి స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి……

Comments