షాక్ : ఆసుపత్రి వద్ద మేము చెప్పినవన్నీ అబద్దాలు.. ‘అమ్మ’ అప్పటికే..!


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక అనేక అనుమానాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ అనుమానాల్ని నివృత్తి చేయడంలో పళనిస్వామి ప్రభుత్వం వెనుకంజ వేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అన్నా డీఎంకే నేత శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్ 22 న ఆసుపత్రి పాలైన జయలలిత చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. జయలలితని స్మరించుకుంటూ అన్నా డీఎంకే పార్టీ శుక్రవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అన్నా డీఎంకే నేత శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో లోపల ఏం జరుగుతుందో తమకు కూడా తెలియదని అన్నారు. పార్టీలో గందరగోళం కలగకుండా, ప్రజల్లో అలజడి చెలరేగకుండా ఉండేందుకు అంతా బాగానే ఉన్నట్లు మీడియా ముందు అబద్దాలు మాట్లాడామని అన్నారు.

ఆసుపత్రిలో జయలలితకు చికిత్స జరుగుతున్న అంతస్తులోకి శశికళ మినహా మరెవరూ వెళ్లేవారు కాదు. గవర్నర్ మొదలుకుని రాహుల్ గాంధీ, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు వంటి వారంతా ఆసుపత్రి డైరెక్టర్ గదిలో మాట్లాడి వెళ్లారు. అమ్మ మరణం వెనుక ఉన్న అనుమానాలు ముమ్మాటికీ నిజమని శ్రీనివాసన్ అన్నారు. జయలలిత మరణం వెనుక శశికళ, దినకరన్ ల హస్తం ఉందని సంచలనమైన ఆరోపణలు చేసారు. జయలలిత ఏ సమయం మరణించిందో శశికళను మినహా మరెవ్వరికీ తెలియదని అన్నారు. జయ మరణించిన తరువాత కూడా చికిత్స నాటకం ఆడించిందా అనే అనుమానాల్ని కొట్టిపారేయలేమని శ్రీనివాసన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Comments