ఈ రోజు తేలనున్న శశికళ భవితవ్యం..?

sasikala
గురువారం తమిళనాడు రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. జయలలిత మరణం తరువాత ఆ రాష్ట్రంలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.దేశ వ్యాప్తంగా ప్రజలందరూ అక్కడి రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. గురువారం చెన్నైలో జరగనున్న పార్టీ సర్వ సభ్య సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

జయలలిత మరణం తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి, ముఖ్యమంత్రి పదవి ఖాళీ అయ్యాయి. ముఖ్యమంత్రి పదవిలో పన్నీర్ సెల్వంను కూర్చోబెట్టి భర్తీ చేశారు. కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మాత్రం ఖాళీగా ఉంది. ఈ పదవిని ఎవరికీ కట్టబెట్టాలా అని కొన్ని రోజులు మల్లగుల్లాలు పడ్డారు. ఇప్పుడు పార్టీ సీనియర్ నేతలంతా శశికళవైపే మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు జరిగే పార్టీ సమావేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనకుండా శశికళ కూడా ముందు చూపుగా వ్యవహరిస్తున్నారు. శశికళ వ్యతిరేఖ వర్గం వారికి ఆహ్వాన పత్రాలు పంపకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే పార్టీ సర్వ సభ్య సమావేశానికి వచ్చే వాళ్ళు తప్పకుండ ఆహ్వాన పత్రం తీసుకు రావాలని షరతును విధించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే సర్వ సభ్య సమావేశం మీదే అందరి దృష్టి నెలకొని ఉంది.

Comments