ఈ సారి హెచ్1బి వీసా దరఖాస్తులు పెరిగాయి : యూఎస్‌సీఐఎస్‌

ప్రత్యేక వృత్తుల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న విదేశీ సిబ్బందిని అమెరికా కంపెనీలు తమ ఉద్యోగులుగా నియమించుకోవడానికి ఈ హెచ్‌1బీ వీసా వీలు కల్పిస్తుంది. భారత్‌, చైనా వంటి దేశాలకు చెందిన వేల మంది ఉద్యోగులు ఈ వీసాల మీద ఆధారపడి అమెరికాలో పనిచేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం హెచ్ 1బి వీసాల దరఖాస్తులు ఈసారి ఊహించిన దానికంటే కాస్తే ఎక్కువగానే వచ్చినట్లు యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. ప్రతి ఏటా 65వేల హెచ్‌1బీ వీసాలను మంజూరు చేస్తారు. ఈ ఏడాది యూఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసేంత హెచ్‌1బీ వీసాల కంటే ఎక్కువగానే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

వీటితో పాటు మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి మంజూరు చేసే 20వేల వీసా క్యాప్‌కు సంబంధించి సరిపడా దరఖాస్తులు వచ్చినట్లు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. హెచ్‌1బీ వీసాల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని చెప్పలేం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లాటరీ పద్ధతి అనుసరించే వీసాలు జారీ చేస్తాం అని యూఎస్‌సీఐఎస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. సెలెక్ట్‌ కాని దరఖాస్తుదారులు చెల్లించిన రుసుమును తిరిగి ఇచ్చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఈనెల 2 నుంచి హెచ్‌1 వీసాల దరఖాస్తుల ప్రకియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దరఖాస్తుల్లో చిన్న చిన్న తప్పులను ఉపేక్షించబోమని యూఎస్‌సీఐఎస్‌ ఇటీవలే హెచ్చరించిన విషయం మనకు తెలిసిందే…..

Comments