టిఆర్ఎస్ లోకి ఆ టీడీపీ సీనియర్ నాయకుడు ?

ఇటీవల కొద్దిరోజుల క్రితం తెలంగాణ సీనియర్ టీపీడీ నేత మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ పరిస్థితి తెలంగాణాలో అద్వాన్నంగా ఉందని, కావున టిఆర్ఎస్ లో విలీనం చేస్తే బాగుంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ తరువాత చంద్రబాబు నాయుడుగారు ఇక్కడ ఒక్కసారి పర్యటన చేస్తే బాగుంటుందని చాలా సార్లు చెప్పినప్పటికీ, ఆయన వీలుకుదరడం లేదు అంటున్నారని, ఇప్పటికే ఇక్కడి నేతలు చాలామంది టిఆర్ఎస్ లోకి వెళ్తున్నందువల్ల బాధతో అటువంటి వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చుకున్నారు. గత కొద్దిరోజలుగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్న ఆయన వ్యవహార శైలిపై పార్టీలోని కొందరు అనుమానించారు.

అంతేకాదు ఇటీవల టీడీపీ భువనగిరిలో చేపట్టిన మినీ మహానాడులో చంద్రబాబు వ్యవహార శైలి వల్ల కలత చెందిన అయన ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినట్లు కొందరు టిడిపి నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి పలు సందర్భాల్లో కేసీఆర్ ని, టిఆర్ఎస్ ని ఇరుకునపెట్టి పలువిధాలుగా విమర్శలు ఎక్కుపెట్టిన సందర్భాలు లేకపోలేవు. కాగా ఆయన నేడు అదే టిఆర్ ఎస్ పార్టీలో చేరనున్నారు అనేది తెరమీదకు వచ్చిన సరికొత్త విషయం. నిజానికి ఎప్పటినుండో తెలంగాణాలో టిడిపి మరుగున పడిపోవడం, అంతేకాక పార్టీకి ఒకప్పుడు వెన్నుదన్నుగా వున్న సీనియర్ నాయకులు ఎందరో టిఆర్ఎస్, కాంగ్రెస్ ల లో చేరడం వంటివి ఆయనను చాలా వారకు కృంగదీసాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు తర్వాత టీడీపీ పరిస్థితి మరింత దిగజారిందని, చిన్న స్థాయినేతలు కూడా పార్టీ నుండి వెళ్లిపోవాలని చూస్తున్నారని మోత్కుపల్లి పలుమార్లు ఆవేదన చెందారు.

చంద్రబాబు ఇకనైనా మేల్కొని ఆంధ్రకు కేటాయించిన సమయంలో కాస్త అయినా ఇక్కడి పార్టీ పై కూడా దృష్టిపెడితే మంచిదని హితవు పలికారు. అయితే అనుకున్న ప్రకారమే ప్రస్తుతం ఇక్కడి టిడిపి చాలావరకు తన ప్రభావాన్ని కోల్పోవడం, అక్కడక్కడా వున్న కొందరు నేతలు కూడా పూర్తిగా పక్క పార్టీలపై చూడడంతో ఇక చివరికి ఆయన కూడా పార్టీ మరి టిఆర్ఎస్ లో చేరడానికి సన్నద్దమయ్యారట. రానున్న పంచాయితీ ఎన్నికలకు ముందు ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే టిఆర్ ఎస్ మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఆయన్ను కలిసి ఆ పార్టీలో చేరే విషయమై చర్చలు కూడా జరిపారని అంటున్నారు. ఇన్ని అవమానాలు భరిస్తూ, సీనియర్ గా ఈ పార్టీలో వుండి మాత్రం ఉపయోగం ఉండదని, అదే టిఆర్ ఎస్ లోకి వెళితే కొంత మేర భవిష్యత్ అయినా ఉంటుందని కొందరు ఆయనకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి మరి. ఒకవేళ నిజమే అయినట్లయితే టిటీడీపీ మరొక గొప్ప నేతను కోల్పోయినట్లే…….

Comments