ఢిల్లీలో పోరుబాటపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు…

గత కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్‌చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీలో చేస్తున్నపోరాటాన్ని ఇంకాస్త ఉధృతం చేశారు. మొదటిరోజైన సోమవారం లోక్‌సభను స్తంభింపజేసిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. రెండోరోజైన మంగళవారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. లోక్‌సభ లోపల, బయట లోక్‌సభ దద్దరిల్లేలా నిరసన వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని ముస్లింలు, ఎస్టీలకు విద్యాసంస్థల్లో, ఉద్యోగ కల్పించడానికి ఇచ్చిన మాటలో మరిన్ని రిజర్వేషన్లు ఇచ్చేందుకుగాను ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 50% నుంచి 62 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ గతేడాది ఏప్రిల్‌లో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని విన్నవించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిపిన ఎంపీలు 11 గంటల తర్వాత లోక్‌సభలో కూడా తమ నిరసన గళాన్ని వినిపించారు. ఎంపీల నిరసన ప్రతిధ్వనులతో లోక్‌సభ ఉక్కిరి బిక్కిరి అయింది. వారిని శాంతింపజేసేందుకు స్పీకర్ సుమిత్రామహాజన్ చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో. లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత జితేందర్‌రెడ్డి, ఉపనేత వినోద్‌కుమార్,ఎంపీ కవిత, బాల్కసుమన్ తదితరులు పోడియం వద్దకు వెళ్లి నిరసన గళాన్ని తెలిపారు.
అయితే ఇదే సమయంలో కావేరీ నదీ జల వివాదంపై తమిళనాడు ఎంపీలు, ఏపీకి ప్రత్యేక హోదాకోసం ఆయా రాష్ట్ర ఎంపీలు నిరసనలతో పోరు సాగించారు. ఎంపీల నిరసన ప్రతిధ్వనుల కారణంగా సభను రెండుసార్లు వాయిదావేయాల్సి వచ్చింది. అనంతరం కరీంనగర్ ఎంపీ, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష ఉపనేత బీ వినోద్‌కుమార్ పత్రికా, మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల నియామకాలలో 50శాతానికి మించి రిజర్వేషన్లను సుప్రీంకోర్టు అనుమతించిన దాఖలాలున్నాయని గుర్తుచేశారు. ఎం నాగరాజు, ఇతరులకు, కేంద్రానికి మధ్య గల కేసులో, అంతే కాకుండా అశోక్‌కుమార్ అనే వ్యక్తికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కేసులో 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన విషయాన్ని వివరించారు. ఈ తీర్పులను దృష్టిలో పెట్టుకుని తమ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెండు ప్రత్యేక కమిటీలను నియమించారని వెల్లడించారు. షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లపై అధ్యయనానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ చెల్లప్ప ఆధ్వర్యంలో, ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీ సుధీర్ ఆధ్వర్యంలో కమిటీలను నియమించారని అన్నారు.

Comments