ప్రచురణ తేదీ : Sun, Oct 8th, 2017

టీడీపీ సైకిల్ పంక్చర్? కారులో లిఫ్ట్ కోసం ప్రయత్నం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలో తెలుగుదేశం ఆధిపత్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, టీడీపీ ఒక మోస్తరు స్థానాలని గెలుచుకున్న తరువాత కాలంలో ఎమ్మెల్యేలు పసుపు కండువా వదిలేసి గులాబి కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఒకరు, ఇద్దరు నేతలు మాత్రం టీఆర్ఎస్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అందులో రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉంటాడు. అయితే టీఆర్ ఎస్ పార్టీ నోటుకి ఓటు కేసులో అతన్ని అడ్డంగా ఇరికించింది. దాంతో అంత వరకు రేవంత్ వెనక నిలబడ్డ చంద్రబాబు కూడా కేసీఆర్ స్పీడ్ కి బ్రేక్స్ వేయడం కరెక్ట్ కాదని సైలెంట్ అయిపోయాడు. తెలంగాణా రాజకీయాల్లో ఎలాంటి జోక్యం కల్పించుకోకుండా ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తన స్పీడ్ గా కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఇలాంటి పరిస్థితిలో తాజాగా పరిటాల శ్రీ రామ్ పెళ్లి వేడుకకి కేసీఆర్ వెళ్ళడం, అక్కడ టీడీపీ నేతలతో పిచ్చాపాటిగా మాట్లాడటం జరిగింది. దీంతో కేసీఆర్, టీడీపీ మధ్య కాస్త సహృద్భావ వాతావరణం ఏర్పడింది. కేసీఆర్ ఏపీలో అభివృద్ధి, పరిపాలనని మెచ్చుకోవడం ద్వారా తన అభిమతం ఏంటో అనే విషయం చెప్పకనే చెప్పాడు. దీంతో అక్కడి టీడీపీ నేతలు బాబుతో మాటల సందర్భంలో తెలంగాణలో కేసీఆర్ తో గొడవ పడేకంటే అతనితో కలిసి పనిచేయడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే కాస్త గౌరవప్రదమైన స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పినట్లు తెలుస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో టీడీపీ నుంచి ఒక్కడిగా ఉంటూ తన పోరాటం కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీని తెలంగాణలో నిలబెట్టి, తన స్టామినా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏపీ తెలుగు దేశం నాయకులు ఆలోచనలు రేవంత్ రెడ్డికి కాస్త అసహనం కలిగిస్తున్నాయని. టీడీపీ నిజంగా కారు ఎక్కే ప్రయత్నం చేస్తే తనదారి తాను చూసుకుంటా అనే నిర్ణయాన్ని అధినేత ద్రుష్టికి తీసుకెళ్ళాడని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. మరి అందులో నిజం ఏంటి అనేది భవిష్యత్తు సమాధానం చెబుతుంది. అంత వరకు ప్రతి ఒక్కరు ఓపికగా ఎదురు చూడటమే.

Comments