సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సెలవు పెట్టక తప్పదా? మంద గమనంలో?


ఇప్పటి వరకు ఇండియాలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాఫ్ట్ ఇంజనీర్ జాబు అంటే లక్షలు జీతాలు వచ్చే అద్బుతమైన ఉద్యోగం. మరి ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబు అంటే -ప్రతి ఒక్కరికి భయం ఎప్పుడు ఉద్వాసనకి గురవుతారో, ఎప్పుడు ఆర్ధిక మాంద్యంతో జీతాలని కోత పెడతారో అర్ధం కాక ఉద్యోగులు తలలు పట్టుకుంటూ ఉంటె. కొత్త ఉద్యోగాల నియామకం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఇంజనీరింగ్ నిరుద్యోగులు సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతున్నారు. ఐటీ పరిశ్రమ కొత్త కొలువుల విషయంలో ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తోంది. ప్రధానంగా ఆటోమేషన్‌కు తోడు డిజిటల్, క్లౌడ్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) దిశగా అడుగులేస్తున్న ఐటీ కంపెనీలు.. జాబ్‌లెస్‌ వృద్ధిపై దృష్టిపెడుతున్నాయి. ఉన్న ఉద్యోగులను తొలగించడం లేదని చెబుతూనే… కొత్త నియామకాల్లో తగ్గించినట్లు చెబుతున్నాయి. ఉద్యోగుల ఉత్పాదక సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచడం ద్వారా, అంటే ఉన్న సిబ్బంది నుంచే సాధ్యమైనంత మేర పనిని పిండుకొని లాభదాయకతను నిలబెట్టుకోవాలనేది వాటి వ్యూహం. ఫలితంగా దేశీ ఐటీ రంగంలో కొత్త కొలువులు కష్టంగా మారే పరిస్థితి నెలకొంది. అమెరికా సహా కొన్ని దేశాల రక్షణాత్మక చర్యలు, వీసా నిబంధనల కఠినతరం వంటివి కూడా ఐటీ రంగానికి పెను సవాళ్లుగా మారుతున్నాయి.

దిగ్గజ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఉద్యోగుల వలసల రేటు భారీగా పెరగడం, నికర నియామకాలు తగ్గడాన్ని చూస్తుంటే నైపుణ్యాలు, పనితీరు సరిగ్గా లేవంటూ కొంతమంది సిబ్బందికి పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న వాదనలు కూడా బలపడుతున్నాయి. ఇలా పొగబెట్టి పంపించేసిన వారిని వెళ్లిపోయిన వారిగా చూపించటం వల్లే అట్రిషన్‌ రేటు అంత ఎక్కువ ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల విలువ 117 బిలియన్‌ డాలర్లు. ఇందులో దాదాపు ఐదో వంతు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లదే. అయితే, ఇప్పటివరకూ దేశీ ఐటీ కంపెనీలకు భారీగా వ్యాపారాన్ని ఇస్తున్న బ్యాంకింగ్, రిటైల్, ఇంధన రంగం వంటి సంప్రదాయ సర్వీసుల నుంచి ఆదాయంలో మందగమనం ఐటీ కంపెనీలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఎందుకంటే మన ఐటీ సంస్థలు సంపాదిస్తున్న ప్రతి 5 డాలర్లలో 4 డాలర్లు ఈ రంగాలకు చెందిన సేవల నుంచే లభిస్తున్నాయి. మరోపక్క, ఆటోమేషన్‌ కారణంగా కిందిస్థాయి ఉద్యోగుల అవసరం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. ఐటీ సంస్థల ప్రధాన క్లయింట్లు కూడా డిజిటల్, క్లౌడ్‌ వంటి టెక్నాలజీలవైపు తమ వ్యయాలను మళ్లిస్తుండటం కూడా ఆ దిశగా మన ఐటీ కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి.

డిజిటల్‌ నైపుణ్యాల్లో 2.15 లక్షల మందికిపైగా ఉద్యోగులకు శిక్షణనిచ్చినట్లు తాజాగా టీసీఎస్‌ వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఐటీ కంపెనీ లకు ప్రధాన ఆదాయ వనరైన అమెరికా వంటి దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణితో మన కంపెనీలు అమెరికన్లను ఎక్కువ జీతాలిచ్చి తప్పకుండా నియమించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు అమెరికన్లకు భారీగా కొలువులను కూడా ప్రకటించాయి. ఈ ప్రభావంతో కంపెనీల వ్యయం పెరిగి దేశీయంగా కొత్త ఉద్యోగాలను కల్పించేందుకు వెనకాడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త టెక్నాలజీలకు మారుతున్న తరుణంలో కొత్తవారికి అవకాశాలు సన్నగిల్లుతాయన్నది తాజాగా కంపెనీల వాదన. అంతర్గతంగా టాలెంట్‌ పూల్‌ (నిపుణులను తయారు చేసుకోవడం) ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే మా కంపెనీ స్థాయి దృష్ట్యా డిజిటల్, క్లౌడ్‌ వంటి కొత్త సేవల్లో అనుభవం ఉన్నవారిని పూర్తిగా బయటి నుంచి తీసుకోవడం కష్టం. కొందరిని నియమించుకుంటాం కానీ, ఎక్కువగా ప్రస్తుత ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపయోగించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం అని టీసీఎస్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ అజోయ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ఇలా ప్రస్తుత పరిస్థితుల బట్టి సాఫ్ట్ వేర్ రంగంలో ప్రతి ఏడాది కొలువుల సంఖ్య తగ్గుతూ వస్తుందని తెలుస్తూనే ఉంది. అందుకే ఇప్పటి నుంచే ఇంజనీరింగ్ యువత ప్రత్యామ్నాయ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలని కొందరు నిపుణులు చెబుతున్నారు.

Comments