పవన్ కు పొలిటికల్ టచ్చింగ్స్ మొదలయ్యాయిగా..!

మొన్నీమధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. జనసేన తొలి కార్యకర్తగా పవనే సభ్యత్వాన్ని అందుకోవడం విశేషం. ఈ సభ్యత్వ కార్యక్రమం త్వరలోనే జనసైనికుల్లోకి వెళ్లనుంది. కొత్త సంవత్సరం వేళ కేసీఆర్ ని కలసి తెలంగాణాలో పొలిటికల్ హీట్ పెంచిన పవన్ కు అన్నీ శుభశకునాలు ఎదురవుతున్నట్లు ఉన్నాయి.

జనసేన పార్టీలో పవన్ అభిమానులు తప్ప మరే రాజకీయ నాయకుడు చేరడం కష్టం అనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో ఓ సీనియర్ రాజకీయ నాయకుడు పరోక్షంగా జనసేనకు జై కొట్టేసారు. జనసేనలో పవన్ ని పక్కన పెడితే పూర్తి స్థాయి ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడు లేరు. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ జనసేన పార్టీ వైపు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనంగా మారాయి. చింతా మోహన్ ఇటీవల టీడీపీ, వైసిపి లని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. చిరు తన సలహా పాటించి ఉంటె రాజకీయాల్లో సక్సెస్ అయి ఉండేవారని కూడా వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి సరికొత్త నాయకత్వం కావాలని, మచ్చలేని నాయకుడు రావాలని చింతా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. కొత్తసంవత్సరం సందర్భంగా చింతా మోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. సంపాదనమీద ఆసక్తి లేని నాయకుడు, మచ్చలేని వ్యక్తి, నిజాయతీ పరుడు, నిలదీసే మొనగాడు రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నాడని అతడికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. చింతా చేసిన వ్యాఖ్యలు పవన్ ని ఉద్దేశించినవే అని, ఆయన ఇప్పటికే పవన్ తో టచ్ లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Comments