ప్రచురణ తేదీ : Sat, Oct 7th, 2017

ఎన్టీఆర్ భవన్ లో సోనియా గాంధీపై పొగడ్తల వర్షం.. ఏంటి రేవంత్ గారూ..!


ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న తెలుగు దేశం పార్టీ తెలంగాణాలో మాత్రం పట్టు కోల్పోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలోను క్యాడర్ ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని అనడంలో సందేహం లేదు. కానీ అధికార టిఆర్ ఎస్ పార్టీ బలపడుతున్న క్రమంలో టీడీపీ కేడర్ బలహీన పడిపోతోంది. కార్యకర్తల నుంచి బడా నేతల వరకు అంతా టిఆర్ ఎస్ లోకి వలస వెళుతున్న వైనం గమనిస్తూనే ఉన్నాం. తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో భవిషత్తు ఉందా అనేది రాజకీయ వర్గాల్లో మెదులుతున్న పెద్ద ప్రశ్న. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి మాత్రమే టి- టిడిపిలో స్టార్ క్యాంపైనర్ గా ఉన్నారు. టీడీపీకి తెలంగాణాలో భవిషత్తు లేదు కనుక ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు తెలంగాణలో పరిధిని పెంచుకుంటున్నాయి.

తాజగా టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి ఓ వైపు కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రశంసలు కురిపించడం టీడీపీ క్యాడర్ ని గందరగోళానికి గురిచేసింది. రేవంత్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు దీని ద్వారా స్పష్టంగా అర్థం అవుతోందని కొందరు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. సోనియా గాంధీ దయ తెలిస్తేనే తెలంగాణ వచ్చిందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆమె కాళ్లు మొక్కిన కేసీఆర్ నమ్మక ద్రోహం చేసారని అన్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు.. కేసీఆర్ తో సన్నిహితంగా మెలగడం కూడా రేవంత్ కు నచ్చలేదని దీనితో తన దారి తాను చూసుకునే పనిలో ఉన్నట్లు రాజకీయ గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు లేఖ వలన తెలంగాణ వచ్చిందని టీడీపీ కేడర్ చెప్పుకుంటుంది. కానీ సోనియా దయవలన తెలంగాణ వచ్చిందని రేవంత్ ఎన్టీఆర్ భవన్ సాక్షిగా వెల్లడించడం టీడీపీకి ఇబ్బందికర వాతావరణమే. మొత్తానికి ఎన్టీఆర్ భవన్ లో కాంగ్రెస్ అధినేత్రికి గౌరవం దక్కిందన్నమాట.

Comments