ఎవరి విశ్వసనీయత ఏమిటో తేల్చుకుందాం రండి : కెసిఆర్ కు రేవంత్ సవాల్!

వరుసగా నాలుగు రోజులనుండి విద్యుత్ సరఫరా, వాటి ఒప్పందాల పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎదుట గల అమరవీరుల స్థూపం వేదికగా ఈ సవాళ్లు-ప్రతిసవాళ్లు జరిగాయి. అధికార టి ఆర్ ఎస్ నేతల సవాళ్లకు వివరణ ఇచ్చేందుకు గన్ పార్క్ కు వచ్చిన రేవంత్ రెడ్డి, తనకు సవాల్ విసిరిన అధికార పార్టీ నేతలు ఎవరు రాలేకపోవడం తో టి ఆర్ ఎస్ పై, ముఖ్యమంత్రి కె సి ఆర్ పై విరుచుకు పడ్డారు. కె సి ఆర్ చెపుతున్న విద్యుత్ వెలుగుల వెనుక బోలెడంత అవినీతి దాగి ఉందని, రాష్ట్ర విభజన సమయం లో విద్యుత్ కేటాయింపుల విషయం లో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రోజెక్టుల వల్లనే ఇప్పుడు మిగులు విద్యుత్ సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు. విద్యుత్ వెలుగుల అవినీతి పై టి ఆర్ ఎస్ విసిరిన సవాలు పై చేర్చకు తాను గన్ పార్క్ కు వస్తే, సవాల్ విసిరి కేవలం 24 గంటలు కూడా గడవక ముందే టి ఆర్ ఎస్ నేతలు మాత్రం తోక ముడిచారన్నారు. ధైర్యంగా వచ్చిన తన విశ్వసనీయతకు, దొంగల వలే భయపడి పారిపోయిన అధికార పార్టీ విశ్వసనీయతకు పోలికే లేదని ఆయన విమర్శించారు. నాడు ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని పోలవరం కాంట్రాక్టులు దక్కించుకున్న కె సి ఆర్ భాగోతం బయటపెట్టింది తనే నన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు.

వాస్తవాలు మాట్లాడేందుకు తానెపుడు సిద్ధమేనని. అవసరమైతే ఉస్మానియా యూనివర్సిటీకి అయినా లేదా అమరవీరుల కుటుంబాల వద్దకు అయినా వెళ్లడానికి తానెప్పడూ సిద్ధమేనని, కానీ కె సి ఆర్ అలా వెళ్లగలరా అని ప్రశ్నించారు. ఒకవేళ నిజంగా విశ్వసనీయత ఉంటే ఆయన రావాలని, అప్పుడు ఎవరి విశ్వసనీయత ఏంటో తెలుస్తుందన్నారు. బి హెచ్ ఈ ఎల్ కు టెండర్లు పిలవకుండా 30,400 కోట్ల రూపాయల పనులు ఎందుకిచ్చారో చెప్పాలని, అందులో వున్న తన బినామీలకు ఆ పనులు ఇప్పించుకుంటున్నారని అన్నారు. ఈ నిర్ణయం తో జెన్కో కు 5000 కోట్ల నష్టం వచ్చిందని, ఈ నష్టాన్ని కె సి ఆర్ భరిస్తారా లేక, వేరెవరైనా మంత్రి భరిస్తారా అని అన్నారు. చివరిగా తెలంగాణ ఇచ్చిన సోనియా కాళ్లకు మ్రొక్కిన కె సి ఆర్ విశ్వసనీయత ఏమిటో అందరికి తెలుసని ఆయన ఎద్దేవా చేశారు…

Comments