ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

ముగ్గురు పవర్ ఫుల్ మాజీ ఎంపీలు..ఆయనొక్కడు జనసేన గురించి ఆరా..!!

ఆ ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో రాజ్యం ఏలారు. ఒకే జిల్లాకు చెందిన ఈ ముగ్గురి నేతల పయనం ఎటు అనేదాని గురించే ఇప్పుడు జిల్లాలో చర్చ జరుగుతోంది. వారెవరో కాదు.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ మరియు అమలాపురం మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, పళ్లం రాజు మరియు హర్ష కుమార్. ఈ ముగ్గురిలో పళ్లం రాజు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఉండవల్లి మరియు హర్ష కుమార్ లు కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరి పయనం ఎటువైపు ఉండబోతోంది ? టీడీపీ, వైసిపి, జనసేన మరియు బిజెపి లలో ఏపార్టీ వైపు వీరు మొగ్గు చూపుతారు అనే చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురు రాజకీయంగా అనుభవం కలవారు కావడంతో వీరి చేరిక ఆయా పార్టీలకు లాభిస్తుందనేది జిల్లా రాజకీయ వర్గాల అభిప్రాయం.

కాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న కొద్ది మందిలో ఉండవల్లి కూడా ఒకరు. ఏదైనా ఇష్యూ ని టేకప్ చేశారంటే అందులోని లా పాయింట్లు లాగి మరీ ప్రత్యర్థుల్ని ఇరకాటంలోకి నెట్టగల నేర్పరి ఆయన. వై ఎస్ కు సన్నిహితుడు కావడంతో చాలా కాలం నుంచి ఉండవల్లిని వైసిపిలో చేర్చుకునేందుకు జగన్ ఆరాటపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందే ఉండవల్లి వైసిపిలో చేరితే జగన్ కు బలం చేకూరినట్లే.

ఇక పళ్లం రాజు సైలెంట్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన ఒకానొక అనుచరుడని అంటారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉండడంతో ఆయన ఆ పార్టీని వీడే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. కానీ అటు టీడీపీ, బిజెపి లనుంచి పళ్లం రాజుకు ఆఫర్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు కనుక ఎన్నికల నాటికి జంప్ అయినా ఆశ్చర్య పోనవసరం లేదు.

దళిత నేత మాజీ ఎంపీ అయిన హర్ష కుమార్ సమైఖ్యాంద్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిలో ఈయన కూడా ఒకరు. హర్షకుమార్ కు కూడా వైసిపి నుంచి పిలుపు అందిందనే వార్తలు ఉన్నాయి. తనకు కేటాయించబోయే పదవి విషయంలో జగన్ నుంచి ఎలాంటి హామీ వెలువడకుండా ఆయన వైసిపిలో చేరేందుకు సాహసించడం లేదని అంటున్నారు. మరో ఆసక్తిమరమైన విషయం ఏంటంటే ఈయన జనసేన పార్టీ గురించి పదే పదే ఆరాతీస్తునట్లు కూడా వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీ ఎదుగుదల ఎలావుంది ? 2019 ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతోంది వంటి విషయాలని ఆయన తన అనుచరుల ద్వారా తెలుసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. తన రాజకీయా భవిష్యత్తు కోసం జనసేనని కూడా ఓ ఆప్షన్ గా పెట్టుకున్నారట.

Comments