ప్రచురణ తేదీ : Jan 11, 2018 4:54 PM IST

పవన్ కళ్యాణ్ వెండి తెరని వదులుకోవాల్సిందేనా..?


పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు కాకపోయినా మెగాస్టార్ చిరంజీవి స్థాయిలో వెండి తెరపై రారాజుగా వెలుగు వెలుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి భిన్న స్పందన వస్తోంది. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తాడా లేదా అనే ఆసక్తి నెలకొని ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాల్లో సరైన విజయం దక్కలేదు. ఓ మంచి హిట్ చిత్రంలో పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ పై దృష్టి సారించాలనేది ఆయన అభిమానుల్లో కొందరి వాదన.

రాజకీయ పండితులు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే సినిమాలనుంచి తప్పుకోవాల్సి సమయం ఇదని సూచిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తే మాత్రం పవన్ ఉన్న పళంగా సినిమాలని వదిలిపెట్టాల్సిందే. ఈ సారికి పొత్తులతో సరిపెడదామని భావిస్తే మాత్రం ఇక తుది నిర్ణయం పవన్ కళ్యాణ్ దే.

జనసేన పార్టీ స్థాపించిన తరువాత పవన్ కళ్యాణ్ గోపాల గోపాల, సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు మరియు అజ్ఞాతవాసి వంటి చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా అంటే టీం వర్క్. కానీ ఈ చిత్రాలు నిరాశ పరచడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందనే విమర్శలు ఎదురవుతున్నాయి. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అంటూ పవన్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడని అది ప్రమాదకరం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అజ్ఞాతవాసి మనసులో ఏముందో ఇప్పటి వరకు అయితే బయట పడలేదు.

Comments