ప్రచురణ తేదీ : Dec 28, 2016 2:59 PM IST

పవన్ కళ్యాణ్ ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా ? లేదా ?

pk
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వరుస బహిరంగ సభలు, ప్రజలతో ముఖాముఖీ లు నిర్వహిస్తూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రస్తుతం ఏపీ లో ఉన్న ఆరెండు బలమైన పార్టీలకు(వైసిపి, టిడిపి ) ధీటైన పార్టీ గా ఇంకా ముద్ర పడలేదు. ఆ విషయం లో విశ్లేషకులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఛరిష్మా పై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. కానీ పార్టీ బలోపేతం చేయడంలో అతడు వేస్తున్న అడుగులే అందరిని అయోమయానికి గురిచేస్తున్నాయి.అతడు పార్టీ ని బలోపేతం చేసే క్రమం లో తాను మద్దత్తు పలికిన బీజీపీ విధానాలను సైతం వ్యతిరేకిస్తున్నారు. దీనితో సాధారణం గానే పవన్ పై బిజెపి వైపు నుంచి విమర్శల వెల్లువ కురుస్తోంది.

పవన్ తిరుపతి బహిరంగ సభ నుంచి బిజెపి పై ఘాటు విమర్శలను చేయడం మొదలు పెట్టారు.దీనితో బీజేపీ కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీ బిజెపి ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ వచ్చారు.పలువురు బిజెపి నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పవన్ పై విమర్శలు ఎక్కువవుతున్న క్రమంలో బిజెపి కి కౌంటర్ ఇవ్వడానికి జనసేనలో నేతలు కరువయ్యారన్న వాదన విశ్లేషకులు వినిపిస్తున్నారు. చివరకు పవన్ కల్యాణే సిద్దార్థ్ నాథ్ సింగ్ పై ప్రతి విమర్శలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ధి రోజుల క్రితం పవన్ ట్విట్టర్ వేదికగా బిజెపి ని గోహత్య, రోహిత్ వేముల, పెద్ద నోట్ల రద్దు మొదలగు విషయాల్లో బిజెపి వైఖరిని పవన్ తూర్పారబట్టారు. దీనికి సిద్దార్థ్ నాథ్ సింద్ పవన్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పవన్ విషయం తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు.సిద్దార్థ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి జనసేనలో నాయకులు కరువయ్యారనే విషయం దీనితో బయటపడింది. సిద్దార్థ్ నాథ్ సింగ్ వ్యాఖ్యల పై స్వయంగా పవన్ కల్యాణే స్పందించాల్సి వచ్చింది.

జనసేన లో పవన్ కళ్యాణ్, అతని అభిమానులు తప్ప మధ్యలో మరెవరూ కనిపించడం లేదు. తాజాగా దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాము పవన్ కళ్యాణ్ వల్ల గెలవలేదని, తన అన్ననే గెలిపించుకోలేని వాడు తమనేం గెలిపిస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు వేరే పార్టీ లపై చేసివుంటే ఆ పార్టీ నుంచి పలువురు నేతలు మూకుమ్మడి గా విమర్శలు సంధించే వారు. కానీ జనసేనలో అలా జరగలేదు. ఆబాధ్యతని పవన్ అభిమానులే నిర్వహిస్తునాన్రు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో చింతమనేని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పవన్ అభిమానులు ధర్నాలు నిర్వహించారు. కానీ రాజకీయ పార్టీ అంటే బలమైన నేతలు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్థుల పై విమర్శలు చేయడానికి, ప్రతి విమర్శలు చేయడానికి నేతల బలం అవసరం. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, మోడీ స్థాయిలో పవన్ ప్రచారం పొందారు. ఆ స్థాయి ఉన్న వ్యక్తి సిద్దార్థ్ నాథ్ సింగ్ లాంటి వ్యక్తుల విమర్శలకు స్పందించడం సరైన వ్యూహం కాదని విశ్లేషకులు అంటున్నారు. అలా అని ఎప్పుడూ అభిమానులే ఆ బాధ్యతని నిర్వర్తించడం కూడా సరికాదని అంటున్నారు. సరైన విమర్శలు చేస్తూ ప్రత్యర్థులను ఇరకాటం లో పెట్టడానికి పవన్ కు నేతల బలం అవసరమనే వాదన వినిపిస్తోంది.పవన్ ఆదిశగా ఆలోచిస్తున్నారా.. ?

Comments