ప్రచురణ తేదీ : Dec 6, 2017 1:32 PM IST

‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సర్టిఫికేట్ కోసం ఎవ్వర్నీ అడుక్కోలేదు !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటైన మాటల తూటాలు మొదలుపెట్టేసారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలపై పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా గళమెత్తారు. ఉద్వేగ భరితంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలని ఓట్లు అడిగే హక్కు ఏ రాజకీయ నాయకుడికి లేదని అన్నారు. 2014 ఎన్నికల్లో తాను టీడీపీ, బిజెపి తరుపున ప్రచారం చేశానని అన్నారు. వారు తప్పు చేస్తే ఆ భాద్యత తన మీద కూడా ఉంటుందని అన్నారు. అందుకే పారిపోకుండా వాళ్లని నిలదీయడానికి మీ ముందుకు వచ్చానని పవన్ స్పష్టం చేశారు. తాను సమస్యల నుంచి పారిపోనని అన్నారు. తన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాకు ఓ సర్టిఫికెట్ అవసరమైన నేపథ్యంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ, అధికారిని కానీ అడుక్కోలేదని అన్నారు. తన నైతిక విలువలని పోగొట్టుకోవడం ఇష్టం లేదని పవన్ తెలిపారు.

2014 లోనే వైజాగ్ ఎంపీ గా నిలబడి గెలిచే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నా పోటీ చేయలేదని పవన్ అన్నారు. ఇతర పార్టీలకు ప్రచారం చేశానని తెలిపారు. ఈ సమయంలో అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో పవన్ వారిని వారించాడు. సీఎం సీఎం అంటూంటే మీకు ఆనందంగా ఉంటుందేమో నాకు కాదు. నేను రాజకీయాల్లోకి పదవుల కోసం రాలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతరం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబం శిక్ష అనుభవిస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం తాను ప్రధానికి లేఖ రాస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.

Comments