ప్రచురణ తేదీ : Jan 22, 2018 7:43 PM IST

అనంతపురమే ఫస్ట్..గుట్టు బయటపెట్టేది 2 నెలల ముందే అంటున్న పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కొన్ని రాజకీయ వ్యూహాలని బహిరంగ పరచి మరి కొన్నింటిని దాచేస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ కరీనంగర్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు సుదీర్ఘంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ అనేక విషయాలని వెల్లడించారు. ఇన్నేళ్లు నత్తనడకగా సాగిన జనసేన ప్రస్థానం ఇకపై వేగం పుంజుకోబోతున్నట్లు హింట్ ఇచ్చారు. గతంలో హైటెన్షన్ విద్యుత్ తీగ తనకు తగిలిందని, ఆంజనేయ స్వామి దయవల్లనే ప్రమాదం నుంచి బయటపడ్డానని పవన్ కళ్యాణ్ అన్నారు.

తెలంగాణలో ఈ పర్యటన ముగిసిన అనంతరం తాను ఈ నెల 27 న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో రెండు మూడు రోజుల పర్యటన తరువాత మిగిలిన జిల్లాల పర్యటన గురించి వివరిస్తానని అన్నారు. ప్రజాసమస్యలు ఉన్న ఒంగోలు, విశాఖ ఏజెన్సీ మరియు కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో పర్యటించే ఆలోచనని బయట పెట్టారు.

జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ ని కలసిన సంగతి తెలిసిందే. దానిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు పవన్ స్పందించారు. కేసీఆర్ ని కలిస్తే తప్పేంటని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పవన్ ఆకాశానికి ఎత్తేశారు. కేసీఆర్ హార్డ్ వర్కర్. చాలా బాగా పనిచేస్తున్నారు. దశాబ్దాల తరబడి జరిగిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. తనకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని రెండు రాష్ట్రాల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని అన్నారు.

ఇక ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో జనసేన పోటీ ఉంటుందని ప్రకటించిన జనసేనాని.. ఎన్ని సీట్లలో పోటీ ఉంటుందనే విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించారు. ఎన్నికల కు రెండు నెలల ముందే తమ వ్యూహాలని బయటపెడతామని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో తన ప్రజాయాత్ర ప్రారంభమైనప్పటికీ పవన్ రాజకీయ వ్యూహాల అమలు విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారనేది స్పష్టం అవుతోంది.

Comments