పవన్ కళ్యాణ్ ప్రజా యాత్ర..టిఆర్ఎస్ కి తప్ప అందరికి కాలుతోందే..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు నుంచి తన నిరంతర ప్రజాయాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే పరిమితం అయిన జనసేన రాజకీయాలు ప్రస్తుతం తెలంగాణ గడ్డని కూడా హీటెక్కిస్తున్నాయి. జనవరి 1 న ముఖ్యమంత్రి కేసీఆర్ ని పవన్ కళ్యాణ్ ప్రగతి భవన్ లో కలుసుకున్నారు. 24 గంటల విద్యుత్ కు మద్దత్తు పలికిన పవన్ కళ్యాణ్ కేసీఆర్ కు తాను వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపాడు. అప్పటి వరకు తెలంగాణాలో వినిపించని పవన్ కళ్యాణ్ పేరు చర్చనీయాంశంగా మారింది. అటు ప్రతిపక్షాలు అన్ని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శించాయి.

పవన్ కు ఆ విమర్శల తాకిడి తాజాగా మొదలైన ప్రజా యాత్రతో ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర మొదలు పెట్టక ముందే అతడిని అడ్డుకుంటామని టి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. తాజాగా బిజెపి కూడా స్వరం పెంచుతోంది. విడుదల కాక ముందే ఫెయిల్ అయిన సినిమా జనసేన పార్టీ అని బిజెపి అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అభివర్ణించారు. జనసేనకు కార్యవర్గం లేదని, కేవలం అభిమానులతోనే పవన్ కళ్యాణ్ హంగామా చేస్తున్నారని కృష్ణ సాగర్ విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓటుని చీల్చడానికి కేసీఆర్ పవన్ కళ్యాణ్ ని ఓ అస్త్రంగా వాడుతున్నారని ఆయన అన్నారు.

ముందస్తు ఎన్నికలు వస్తే ఆరు నెలలు లేదంటే ఏడాది ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో జనసేన సృష్టించబోయే సంచలనాల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Comments