మన శక్తికి మించిన పని.. సామర్థ్యానికి అందని పని అదే : పవన్

మదర్స్ డే సందర్బంగా ప్రస్తుతం సినిమా తారలు రాజకీయ నాయకులూ ఎవరి స్టైల్ లో వారు విషెస్ చేబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు వారి తల్లుల ఫొటోలను పోస్ట్ చేస్తూ అమ్మ గొప్పతనం గురించి వర్ణిస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా మాతృమూర్తులకు వందనాలు అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మదర్స్ డే అంటే అమ్మను తలచుకోవడం మాత్రమే కాదు. అమ్మ మనకు ప్రసాదించిన జీవితాన్ని తలచుకోవడం. ఈ జీవితాన్ని మనకు ప్రసాదించడంలో అమ్మ చేసిన త్యాగాన్ని తలచుకోవడం. మనకు నడక నేర్పిన, నడత నేర్పిన, భాష నేర్పిన, సంస్కారం నేర్పిన ప్రతి అనుభూతిని నెమరు వేసుకోవడమే మదర్స్ డే.

మదర్స్ డే అంటే.. ఏదో ఏడాదికి ఒక రోజు తల్లిని తలచుకుని మిగిలిన రోజులు మొత్తం మరచిపోవడం కాదు. అమ్మంటే మనం జీవించి ఉన్న ప్రతిరోజూ… కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన ఒక బాధ్యత. మనం ఏం చేసినా తీర్చుకోలేని ఒక రుణం. అమ్మ నుంచి మనం పొందడం మాత్రమే ఉంటుంది. ఇవ్వడం అనేది మన శక్తికి మించిన పని. సామర్థ్యానికి అందని పని. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాభివందనాలు. ప్రతి వ్యక్తికీ మాతృమూర్తి ఒకరే ఉంటారు. కానీ ప్రపంచంలో ఉండే తల్లులందరిలోనూ ఒకే స్థాయితో కూడిన మాతృ హృదయం ఉంటుంది. అలాంటి ప్రతి తల్లికీ మనం మనసారా జేజేలు పలకాల్సిందే’ అని పవన్ తన ప్రకటనలో తెలియజేశారు.

Comments