ప్రచురణ తేదీ : Fri, Sep 1st, 2017

రివ్యూ రాజా తీన్‌మార్ :  పైసా వసూల్ – బాలయ్య మారాడు కానీ పూరి మారలేదు

 

తెరపై కనిపించిన వారు : బాలక్రిష్ణ, శ్రియ, ముస్కాన్ సేతి
కెప్టెన్ ఆఫ్ ‘పైసా వసూల్’ : పూరి జగన్నాథ్

మూల కథ :

ఇంటర్నేషనల్ క్రిమినల్ బాబ్ మార్లీ అనే తన తమ్ముడి మరణానికి కారణమైన ఇండియన్ పోలీస్ ఏజెన్సీ మీద పగబట్టి భారతదేశంలో అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతుంటాడు. అతనికి కొందరు రాజకీయనాయకుల సపోర్ట్ కూడా ఉండటంతో ఇండియన్ రా ఏజెన్సీ పెద్దలు కూడా లీగల్ గా అతన్ని ఏమీ చేయలేక అడ్డదారిలోనే అతన్ని చంపాలని ప్లాన్ వేసి, అందుకు సరైన వ్యక్తి కోసం వెతుకుతుంటారు.

అలా వెతుకులాటలో ఉన్న వాళ్లకు క్రిమినల్ తేడా సింగ్ (బాలక్రిష్ణ) తారసపడతాడు. బాబ్ మార్లీని చంపాలని అతనితో పోలీసులు డీల్ కుదుర్చుకుంటారు. అలా పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్న తేడా సింగ్ ఏం చేశాడు ? బాబ్ మార్లీ తమ్ముడ్ని ఎవరు చంపారు ? చివరికి బాబ్ మార్లీ ఎలా అంతమయ్యాడు ? అనేదే తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :

⤏ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ పూరి రాసిన తేడా సింగ్ పాత్ర. ఎప్పుడూ నవ్వుతూ, చలాకీగా, తేడా తేడాగా ప్రవర్తించే తేడా సింగ్ పాత్ర సినిమాలో బాగా ఆకట్టుకునే అంశం. ఆ పాత్ర కనిపించినతసేపు సన్నివేశాలు చూడదగినవిగా ఉంటాయి. కనుక మొదటి విజిల్ ఈ పాత్ర రాసినందుకుగాను పూరికి వేయొచ్చు.

⤏ అలాగే ఆ పాత్రలో బాలయ్య నటన కూడా చాలా బాగుంది. చాలా ఏళ్ల తర్వాత కొత్త తరహా పాత్రలో నటించారాయన. సన్నివేశాల్లో ఆయన ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ కొంచెం గమ్మత్తుగా ఉంటాయి. రెండు పాటల్లో ఆయన చేసిన డ్యాన్స్ కూడా ఎన్ఱాజిటిక్ గా బాగుంటుంది. కాబట్టి రెండో విజిల్ బాలయ్యకు వేయొచ్చు.

⤏ ఇక సినిమా ఫస్టాఫ్ కొంతమేర మెప్పించింది. తేడా సింగ్ పాత్ర, దాని చుట్టూ జరిగే సన్నివేశాల వలన పెద్దగా బోర్ కొట్టకుండా సాగిపోయింది. అంతేగాక పూరి రాసిన ‘ఫ్యామిలీ, ఫ్యాన్స్ మాత్రమీ అలౌడ్.. ఔటర్స్ నాట్ అలౌడ్’ వంటి పంచ్ డైలాగులు బాగా పేలాయి. కాబట్టి వీటికి ముప్పడో విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

⤏ సినిమాలో కొత్త కథ అనేదే లేకపోవడం తీవ్రంగా నిరుత్సాహపరిచే విషయం. పోనీ కథానమైన కొత్తగా ఉందా అంటే అదీ లేదు. సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఒక పాత పూరి సినిమా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది.

⤏ అలాగే సెకండాఫ్లో రివీల్ అయ్యే ట్విస్ట్, కథనం నడిచిన విధానం పరమ బోరింగా ఉండి, పూరి మళ్ళీ నిరుత్సాహపరిచాడే అనిపించింది.

⤏ బాలకృష్ణ వంటి హీరోకి ఎదురుగా బలమైన ప్రతినాయకుడు ఉంటేనే బలయ్యాయ్ వెయిట్ స్క్రీన్ మీద కనబడుతుంది. కానీ ఈ సినిమాలో అలాంటి విలన్ లేకపోవడంతో బాలయ్య ఊపు పెద్దగా తెలియలేదు. అలాగే హీరోయిన్ ముస్కాన్ సేతి కూడా అస్సలు ఆకట్టుకోలేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
⤏ ఈ సినిమాలో పెద్దగా ఆశ్చర్యపోయేటంతటి సన్నివేశాలు, అంశాలు కనబడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : బాలయ్య భలే చేశాడు కదా. కొత్తగా ఉన్నాడు.
మిస్టర్ బి : అవును కరెక్టే.. బాలయ్య మాత్రమే కొత్తగా ఉన్నాడు.
మిస్టర్ ఏ : కానీ బాలయ్యతో పాటే పూరి కూడా మారుంటే సినిమా బాగుండేది.

Comments