ప్రచురణ తేదీ : Nov 30, 2017 4:50 PM IST

రివ్యూ రాజా తీన్‌మార్ : ఆక్సిజన్ – టైటిల్ లో ఉంది కానీ సినిమాలో లేదు

తెరపై కనిపించిన వారు : గోపీచంద్, అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా

కెప్టెన్ ఆఫ్ ‘ఆక్సిజన్’ : జ్యోతి కృష్ణ

మూల కథ :

సంజీవ్ (గోపీచంద్) ఆర్మీలో పని చేస్తూ ఉంటాడు. మూడు సంవత్సరాల తరువాత సొంత ఊరికి వచ్చి తను ప్రేమించిన అమ్మాయి గీత (అను ఇమ్మానుల్)ను కలిసి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. టైగర్ బ్రాండ్ సిగరెట్ వల్ల సంజీవ్ తన తమ్ముడిని కోల్పోతాడు.

అందుకు కారణమైన ఆ బ్రాండ్ యజమాని పై పగ తీర్చుకుందామని పల్లెటూరుకు వస్తాడు సంజీవ్. ఆ తరువాత సంజీవ్ కృష్ణ ప్రసాద్ గా ఎలా మారాడు ? శృతి (రాశీ ఖన్నా)ను వివాహం చేసుకున్నాడా ? టైగర్ బ్రాండ్ యజమానిని సంజీవ్ ఏం చేసాడు ? అనేదే ఈ సినిమా..

విజిల్ పోడు :

⤏ దర్శకుడు జ్యోతి కృష్ణ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ కొద్దిగా డిఫరెంట్ గా బాగానే ఉంది. స్క్రిప్ట్ కూడా సరిగానే రాశారు. కాబట్టి వీటికి మొదటి విజిల్ వేయొచ్చు.

⤏ ఇంటర్వెల్ సమయానికి హీరో పాత్రలో రివీల్ అయ్యే ట్విస్ట్ బాగుంటుంది. ఆ మలుపుతో సినిమాపై ఆసక్తి ఇంకాస్త పెరుగుతుంది. కనులకు రెండో విజిల్ దానికే వెయ్యాలి.

⤏ ఇక హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, రాశీఖన్నాలు స్క్రీన్ మీద అందంగా కనిపించారు. అలాగే యాక్షన్ ఎపిసోడ్లు కూడా బాగున్నాయి. కాబట్టి మూడో విజిల్ ఈ రెండు అంశాలకి కలిపి వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

⤏ దర్శకుడు జ్యోతి కృష్ణ మంచి పాయింట్ నే ఎంచుకున్నా దాన్ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా వరకు విఫలమయ్యారు. ఇది ఖచ్చితంగా అనుభవలేమి కారణంగానే అని చెప్పొచ్చు.

⤏ కథలో అవసరంలేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటి మూలాన సినిమా రన్ టైం పెరిగి మరింత విసుగొచ్చింది.

⤏ పాయింట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడం, సన్నివేశాలు కూడా పాతవే కావడంతో కథనాన్ని ముందుగానే ఊహించేయవచ్చు. దీని వలన సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

⤏ ఈ సినిమాలో అంతగా ఆశ్చర్యానికి గురిచేసే అంశాలు, సన్నివేశాలు లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : టైటిల్ లో ఉన్న ఆక్సిజన్ కథలో లేకుండాపోయింది.
మిస్టర్ బి : అవును.. అందుకే సినిమా జీవం లేకుండా తయారైంది.
మిస్టర్ ఏ : దర్శకత్వ లోపమే ఇందుకు ప్రధాన కారణం అనేది నా ఉద్దేశ్యం.. ఏమంటావ్ ?
మిస్టర్ బి : ఉద్దేశ్యమేమిటి.. అదే నిజం.

Comments