దేశ చరిత్రలో మొదటిసారి వాట్సప్ లో ఎన్నికల నామినేషన్స్…

కలకత్తా హైకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. తొలిసారి వాట్సాప్‌లో దాఖలు చేసిన నామినేషన్లను ఆమోదించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బల్ల గుద్ది ఆదేశించింది. 9 మంది స్వతంత్ర అభ్యర్థులు వాట్సాప్‌లో నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఏడాది పంచాయతీ ఎన్నికల్లో వాళ్లు పోటీ చేసేలా చూడాలని స్పష్టంచేసింది. తాము నేరుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేయలేకపోయామని, అందుకే వాట్సాప్ ద్వారా పంపించామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. నిజానికి ఈ 9 మందిని నామినేషన్లు వేయకుండా కొందరు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు కోర్టుకెక్కారు. వాళ్లందరూ నామినేషన్లు దాఖలు చేసేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

అయితే తమను ఆఫీస్ దగ్గర గంటల కొద్దీ వేచి చూసేలా చేశారని, ఆ తర్వాత కొందరు తమపై దాడి చేసి డాక్యుమెంట్లను లాక్కున్నారని వీళ్లు కోర్టుకు తెలిపారు. తాము వాట్సాప్‌లో మాత్రం వీటిని పంపించామని చెప్పారు. దీంతో వీటినే నామినేషన్ పత్రాలుగా అంగీకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టంచేసింది. దీనిపై ఈ నెల 30న మరోసారి విచారణ జరపనుంది. అయితే ఇది అసాధారణ పరిస్థితుల్లో కోర్టు ఇచ్చిన తీర్పు తప్ప.. ప్రతిసారి ఇలా వాట్సాప్‌లో నామినేషన్లు ఆమోదించే పరిస్థితి ఉండదని రాజ్యాంగ నిపుణుడు, సీనియర్ లాయర్ అరవింద్ దత్తార్ తెలిపారు.

Comments