ప్రచురణ తేదీ : Thu, Jan 5th, 2017

మళ్ళీ హెలికాఫ్టర్ షాట్ కొట్టిన ధోని

dhoni-helicopter-shot
క్రికెట్ మ్యాచ్ లలో ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుని ఎన్నో విజయాలను ఇండియాకి అందించిన కెప్టెన్ ధోని, తన కెప్టెన్సీ ని వదులుకోవడంపై కూడా ఎవరూ ఊహించనంత వేగంగా నిర్ణయం తీసుకున్నాడు. రాత్రికి రాత్రే తన కెప్టెన్సీ పదవిని వదులుకుంటున్నట్టు ప్రకటించి తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అసలేమైందో తెలీదు. అప్పటికప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసాడు. అయితే ధోని తాను ఆటగాడిగా వన్డే, టీ 20 లలో అందుబాటులో ఉంటానని చెప్పి అభిమానులకు కొంత ఊరట కలిగించాడు.

భారత క్రికెట్ చరిత్రలోనే ఎంతో విజయవంతమైన కెప్టెన్ గా ఎదిగిన ధోని తాను అనుకున్నది చేసే వరకు నిద్రపోయేవాడు కాదు. ధోని ఒక కెప్టెన్ గా ఎంతో మంది ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాడు. ఇప్పుడు భారత జట్టులో ఉన్న సగం మంది స్టార్ క్రికెటర్స్ రైనా, జడేజా, అశ్విన్, రోహిత్ శర్మ, ఇలా చాలామందిని ధోని ప్రోత్సహించి అవకాశాలు కల్పించాడు. తాను అనుకున్న జట్టు కోసం కొన్నిసార్లు సెలెక్టర్లను కూడా ఎదిరించేవాడు. ఏది ఏమైనా తాను కోరుకున్న జట్టు తనకు దొరికే వరకు విశ్రమించేవాడు కాదు. ఒక ఆటగాడిపై అతనికి నమ్మకం ఉంటే ఒకటి, రెండు మ్యాచ్ లలో అతను విఫలమైనా అవకాశం కల్పించేవాడు. దీనిని ఎంతమంది తప్పు పట్టినా లెక్క చేసేవాడు కాదు.

ధోని సాధించిన ఘనతలు ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో ఉన్నాయి. కపిల్ దేవ్ కెప్టెన్సీలో చాలా సంవత్సరాల క్రితం ఇండియా వన్డే ప్రపంచ కప్ గెలుచుకుంది. అప్పటి నుండి 100 కోట్ల భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యలో ఒకటి, రెండుసార్లు ప్రపంచ కప్ దగ్గర వరకూ వెళ్లిన కప్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో భారతీయులు చాలా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో 2011 ప్రపంచ కప్ లో ఇండియా ని జగజ్జేతగా నిలిపి 100 కోట్లమంది భారతీయుల కలని నిజం చేసాడు మన మిస్టర్ కూల్ ధోని. అంతేకాదు తొలి టీ 20 ప్రపంచ కప్ సందర్భంగా కెప్టెన్సీ అందుకున్న ధోని ఆ టోర్నీలో ఇండియా జట్టును ధోని నడిపించిన తీరు అద్భుతం. మొదటిసారి తాను కెప్టెన్సీ చేస్తూ జట్టు సభ్యులందరినీ ఒక్క తాటిపై నడిపించి మొదటి టీ 20 ప్రపంచ కప్ ను ఇండియాకు సాధించిపెట్టాడు ధోని.

ఎవరికీ సాధ్యం కాని, ఎవరూ అందుకోలేని ఎన్నో ఘనతలు స్వంతం చేసుకున్న ధోని ఖాతాలో ఇంకా చాలానే ఉన్నాయి. ఎవరెంత రెచ్చగొట్టాలని చూసినా కూల్ గా తన పని తాను చేసుకుంటూ, ప్రత్యర్థులకు పంచ్ ఇవ్వడం ధోనికి అలవాటు. టెస్ట్ మ్యాచ్ లలో భారత జట్టును నెంబర్ వన్ గా ఎదగడంలోనూ, 2011 ప్రపంచ కప్ భారత్ గెలుచుకోవడంలోనూ, 2007 మొదటి టీ 20 ప్రపంచ కప్ గెలవడంలోనూ ధోని కృషి ఎంతో ఉంది. అయితే 2014 లో టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుండి, టెస్టులలో ఆటగాడిగా కూడా తప్పుకుని అభిమానులను నిరాశపరిచాడు. అయితే వన్డే, టీ 20లలో ధోని కెప్టెన్సీ చూడొచ్చు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ధోని షాక్ ఇచ్చాడు. ఇప్పుడు తన చూపంతా వికెట్ల వెనుక కీపింగ్ మీద, వికెట్ల ముందు బ్యాటింగ్ మీద పెట్టాడు. క్రికెటర్ గా అయినా ఇంకొద్దికాలం కొనసాగాలని ధోని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల కలను నిజం చేస్తూ క్రికెటర్ గా ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగుతాడా లేదంటే ఎప్పుడూ తనకు అలవాటైనట్టు సడన్ గా తప్పుకుంటాడా చూడాలి.

Comments