కన్న కూతురుని కనికరం లేకుండా… ఆపై తాపీగా!


మానవీయ బంధాలు రాను రాను కనుమరుగవుతున్నాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ అనే బంధం పాశవికంగా మారిపోతుంది. అవసరాల కోసం, ఆవేశంతో కన్న పిల్లలని కూడా కనికరం లేకుండా చంపెసేందుకు చాలా మంది సిద్దమవుతున్నారు. అమ్మతనానికి మాయని మచ్చగా మారిన ఓ మహిళ తన 7 ఏళ్ల చిన్నారిని దారుణంగా చంపేసిన ఘటన బెంగుళూరు లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్ కి చెందిన కాంచన్ సర్కార్ దంపతులు చాలా ఏళ్ల నుంచి బెంగుళూరులో ఉంటున్నారు. కాంచన్ సర్కార్ ఐటీ కంపెనీలో పని చేస్తూ ఆయన భార్య స్వాతి టీచర్ గా పని చేస్తుంది. అయితే భార్య భర్తల మధ్య మనస్పర్ధల కారణంగా ఇద్దరు గత కొంత కాలంగా వేరుగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో భార్య మానసిక స్థితి కూడా సరిగా లేక ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటుంది. ఈ పరిస్థితిలో స్వాతి సర్కార్ రోజు రోజుకి మితిమీరి ప్రవర్తిస్తూ ఉండేది. ఈ నేపధ్యంలో తన ఏడేళ్ళ కూతురుని ఆదివారం సాయంత్రం మూడో అంతస్తులో ఉన్న ఇంట్లో నుంచి క్రింద పడేసింది. క్రిందికి వచ్చి చూసి చావలేదని డిసైడ్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి మరో సారి పడేసింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లి భాగా ముస్తాబై, చనిపోయిన పాపని చూడకుండా బయటకి వెళిపోతూ ఉంటె. ఆమెని ఆపి అపార్ట్ మెంట్ వాసులు నిలదీశారు. ఆమె సమాధానం సరిగా చెప్పకపోవడంతో అక్కడ ఒక స్తంభానికి ఆమెని కట్టేసి, కొట్టి, పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వలన ఆ హత్య చేసిందా లేక భర్త మీద కోపంతో చేసిందా అనే విషయం పోలీసులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

Comments