అలా జరిగితే తలబాదుకునేది తెలుగు ఎన్నారైలే..!

ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నారై లు ఎదో విధంగా భయపడుతూనే ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ విధానంలో పెను మార్పులు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా వచ్చిన కొత్త ప్రతిపాదన సుమారు 50 వేల మంది ఎన్నారై లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రీన్ కార్డు పొంది అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుచుకోవాలనుకుంటున్న ఎన్నారై ల ఆశలకు కొత్త ప్రతిపాదన గండి కొట్టే విధంగా కనిపిస్తోంది. గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి వేచి ఉండడానికి లేదు. త్వరగా గ్రీన్ కార్డు లభించకుంటే ఇండియాకు తిరుగు ముఖం పట్టక తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇండియాకు చెందిన ఐటీ ఉద్యోగులపైనే ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. అందులో 4 శాతం మంది వరకు తెలుగు వారే ఉండడం శోచనీయం.

గ్రీన్ కార్డు రావడం ఆలస్యం అయితే హెచ్ 1 బి వీసాని పొడిగించుకుంటే సరిపోయేది. కానీ ఇకపై అలా చెల్లదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. హెచ్ 1 బి వీసా ని ఎక్కువరోజులు పొడిగించుకునేందుకు వీలు లేకుండా కసరత్తు మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత చదువులు పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఎమ్ఎస్ చేయడం, అక్కడే ఉద్యోగాలు చూసుకోవడం, అక్కడ పనిచేసే కంపెనీ ఆమోదంతో గ్రీన్ కార్డు కు దరఖాస్తు చేసుకోవడం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారై లు ఇదే పద్దతిని అవలంభిస్తున్నారు. ఇకపై అలా వీలు లేకుండా చేయాలనేది అమెరికా ఆలోచన. కానీ దీనిపై ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని ఐటి నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. ఇప్పట్లో కార్యరూపం దాల్చేది కాదు అని వారి అభిప్రాయ పడుతున్నారు.

ఈ పద్దతిని కనుక అమలు చేస్తే మనకు ఎంత నష్టమో అమెరికాకు కూడా అంతే నష్టం. ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ప్రతిపాదనల్ని రూపొందిస్తున్నారు. ఆరేళ్లలోపు గ్రీన్ కార్డు లభించకుంటే అమెరికాలో ఉద్యోగం చేసే అర్హతని కోల్పోతారు. ఈ ప్రతిపాదన అమలైతే కనుక కనీసం 5 లక్షల మంది భారతీయలు ఇండియా తిరిగి రాక తప్పదని అంటున్నారు. వీరిలో 30 నుంచి 40 శాతం వరకు తెలుగు వారే ఉండవచ్చు అనేది ఓ అంచనా. దీనిపై టెక్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరిగా ఈ ప్రతిపాదనని అమలు చేసి భారతీయుల్ని వెళ్లగొడితే నేను ఖచ్చితంగా స్వాగతం పలుకుతాను. ఇండియా ఐటి రంగంలో దూసుకుపోతున్న సమయంలో ఎన్నారై లు ఇక్కడకి వచ్చేస్తే ఇంకా మంచి జరుగుతుందని ఆయన అన్నారు.

Comments