ప్రచురణ తేదీ : Dec 3, 2017 11:32 AM IST

ఆరో డబుల్ సెంచరీ : కోహ్లీనా..కొరకరాని కొయ్యా..!

సచిన్, బ్రియాన్ లారా వీరేంద్ర సెహ్వాగ్ రికీ పాంటింగ్.. ఈ దిగ్గజాలంతా తమ జనరేషన్ వారైతే బావుంటుందని ప్రస్తుత ప్రపంచ బౌలర్లు భావించడం ఖాయం. ఎందుకంతే పరుగుల యంత్రంగా మారిన విరాట్ కోహ్లీ బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలా మారాడు. సచిన్, సెహ్వాగ్, లారా వంటి ఆటగాళ్ల దూకుడుకు ఓ సమయం సంధర్భం ఉంటుంది. కానీ విరాట్ కోహ్లీ ఎలా ఆడుతున్నాడో ప్రత్యేకంగా వివరించాల్సింది ఏమి లేదు. అది దేశం ఏదైనా, బౌలర్లు ఎవరైనా నేనింతే అంటూ చెలరేగిపోతున్నారు. ఇప్పుడు ఈ ఉపోధ్ఘాతం ఎందుకంటే..మంచినీళ్లు తగినంత సులువుగా కోహ్లీ మరో డబుల్ సెంచరీ బాదేశాడు.

శ్రీలంకతో జరుగుతున్న మూడవ టెస్టులో కోహ్లీ దిగ్విజయంగా కెరీర్ లో ఆరు డబుల్ సెంచరీలు పూర్తి చేసాడు. దీనితో విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాళ్లు సచిన్, సెహ్వాగ్ ల సరసన నిలిచినట్లైంది. 238 బంతుల్లో కోహ్లీ డబుల్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. కోహ్లీ ప్రస్తుతం 265 బంతుల్లో 225 పరుగులు,23 ఫోర్లతో క్రీజులో ఉన్నాడు. టీం ఇండియా ఇన్నింగ్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి భారత్ 487 పరుగులు చేసింది. కోహ్లీకి జోడిగా మరో ఎండ్ లో రోహిత్ శర్మ 52 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన ఆరో డబుల్ సెంచరీ ద్వారా మరో రికార్డు కూడా అందుకున్నాడు. అత్యధిక టెస్టు డబుల్ సెంచరీలు అందుకున్న కెప్టెన్ గా నిలిచాడు. బ్రియాన్ లారాని అధికమిస్తూ కోహ్లీ ఈ ఘనత అందుకోవడం విశేషం.

Comments